ఇంకుడు గుంతలతో రైతుకు లాభాలు
ABN , First Publish Date - 2023-06-03T00:01:25+05:30 IST
ఇంకుడు గుంతలు భవిష్యత్తులో రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని సెంట్రల్ నోడల్ ఆఫీసర్ తనూజ ఠాగూర్ పేర్కొన్నారు.
ఉపాధి పనులు తనిఖీ చేసిన కేంద్ర బృందం సభ్యులు
ధర్మవరం రూరల్, జూన 2: ఇంకుడు గుంతలు భవిష్యత్తులో రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని సెంట్రల్ నోడల్ ఆఫీసర్ తనూజ ఠాగూర్ పేర్కొన్నారు. మండలంలో బుడ్డారెడ్డిపల్లిలో వాటర్‌షెడ్ పథకం కింద చేపట్టిన అమృతసరోవర్ పనులను శుక్రవారం కలెక్టర్ అరుణ్‌బాబుతో కలిసి ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా రైతులు, లబ్ధిదారులతో సమస్యలు అడిగితెలుసుకున్నారు. ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలు పెరిగాయని రైతులు తెలియజేశారు. ఈ నీటి ద్వారానే వేరుశనగ, పండ్లతోటలు సాగుచేసుకుంటున్నామని వివరించారు. వారి వెంట ఆర్డీఓ తిప్పేనాయక్, జాయింట్ కమిషనర్ రూరల్ విభాగం శివప్రసాద్, డ్వామా పీడీ రామాంజనేయులు, అసిస్టెంట్ పీడీ సుధాకర్‌రెడ్డి, ఎంపీడీఓ మమతాదేవి, ఏపీడీ చలపతి, ఏపీఓ అనిల్ కుమార్‌రెడ్డి ఉన్నారు.
నల్లమాడ: మండలంలోని చౌటకుంటపల్లి రైతు గంగాధర్.. ఉపాధి పథకం కింద సాగు చేసిన మామిడి తోటను శుక్రవారం జలశక్తి కేంద్రం గ్రామీణాభివృద్ధి శాఖ అడిషనల్ సెక్రటరీ తనూజ ఠాగూర్, రాష్ట్రజాయింట్ కమిషనర్ మల్లెల శివప్రసాద్, డైరెక్టర్ చిన్నతాతయ్య పరిశీలించారు. మామిడి తోటల ఖర్చు, ఆదాయం, మార్కెటింగ్ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.
ఓబుళదేవరచెరువు: మండలంలోని నల్లగుట్లపల్లిలో అమృతసరోవర్ చెరువు పనులను శుక్రవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అడిషనల్ సెక్రటరీ తనూజ ఠాగూర్ పరిశీలించారు. ఆగస్టు 15 నాటికి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కూలీలు, రైతులతో ముఖాముఖి మాట్లాడారు. చెరువు పనులతో నీటి నిలువలు పెరగడంతోపాటు పంటలు పండించుకోవచ్చన్నారు. పూడికతీత మట్టిని పొలాల్లోకి తొలుకుంటున్నామని, తద్వారా భూములు సారవంతమై, మంచి దిగుబడి వస్తాయని రైతులు కేంద్ర బృందానికి వివరించారు.