హోరు గాలి.. జోరు వాన..
ABN , First Publish Date - 2023-05-21T23:53:32+05:30 IST
పట్టణంలో ఆదివారం సాయంత్రం నుంచి అ ర్ధరాత్రి వరకు గాలివాన బీభత్సం సృష్టించింది. కొన్ని ప్రాంతాల్లో జనం తల్లడిల్లిపోయారు. ఈదురుగాలులతో కూడిన వర్షం తీవ్రనష్టాన్ని మిగిల్చింది.
నేలకొరిగిన విద్యుత స్తంభాలు, చెట్లు
కొట్టుకుపోయిన రేకులు, తోపుడుబండ్లు
పరిగిలో చెట్టు మీదపడి గేదె మృతి
హిందూపురం, మే 21: పట్టణంలో ఆదివారం సాయంత్రం నుంచి అ ర్ధరాత్రి వరకు గాలివాన బీభత్సం సృష్టించింది. కొన్ని ప్రాంతాల్లో జనం తల్లడిల్లిపోయారు. ఈదురుగాలులతో కూడిన వర్షం తీవ్రనష్టాన్ని మిగిల్చింది. కొన్నిచోట్ల ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. విద్యుత స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. అరగంట పాటు కురిసిన వర్షానికి మురుగునీరు తోడై రోడ్డెక్కాయి. అంబేడ్కర్‌నగర్‌లో మూడు విద్యుత స్తంభాలు, చెట్లు కూలిపోయాయి. వేపచెట్టు భాగ్యమ్మకు చెందిన ఇంటిపై పడటంతో గోడ పాక్షికంగా దెబ్బతింది. అంబేడ్కర్ సర్కిల్‌లో గాలివాన బీభత్సానికి తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్మే చిరువ్యాపారులు బెంబేలెత్తారు. వ ర్షం ధాటికి తట్టుకోలేక బండ్లు రోడ్లపైనే వదిలేసి షాపుల కిందకు చేరారు. అరటిపళ్ల తోపుడుబండి సుమారు 200 మీటర్ల దూరం వేగంగా దూసుకెళ్లి దుకాణానికి ఢీకొట్టి ఆగిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పరిగి మండలంలో కురిసిన వర్షం, గాలి బీభత్సానికి సుబ్బరాయనపల్లిలో శ్రీరామప్పకు చెందిన గేదెపై చెట్టు కూలింది. సంఘటనలో గేదె అక్కడికక్కడే ప్రాణాలిడిసింది. సుమారు రూ.80వేల ఆస్తినష్టం వాటిల్లినట్లు రైతు వాపోయాడు. హిందూపురం మండలంలో పలుచోట్ల విద్యుత స్తంభాలు, చెట్లు కిందపడి, జనజీవనం అస్తవ్యస్తమైంది.
మధ్యాహ్నం ఉక్కపోత.. సాయంత్రానికి చల్లదనం
భానుడి ప్రతాపంతో ఆదివారం మధ్యాహ్నం హిందూపురం పట్టణంలో పలు వీధులు నిర్మానుష్యంగా మారాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే పేట వెంకటరమణస్వామి వీధి 2 గంటల సమయంలో జనం లేక వెలవెలబోయింది. అయితే సాయంత్రం ఉన్నఫలంగా కురిసిన వర్షానికి చల్లదనం కమ్ముకుది. పట్టణ వాసులకు ఎండ వేడి, ఉక్కపోత నుంచి కొంత ఉపశమనం ఇచ్చింది.
20 చోట్లకుపైగా నేలకొరిగిన విద్యుత స్తంభాలు
హిందూపురంలో ఈదురుగాలులు, వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పట్టణంలో రాత్రి 9గంటల సమయం వరకు 20 చోట్ల విద్యుత స్తంభాలు నేలకొరిగినట్లు ట్రాన్సకో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భూపతి తెలిపారు. అంబేడ్కర్‌నగర్, ఆర్పీజీటీ రోడ్డు, పట్టణంలోని మరికొన్నిచోట్ల విద్యుత స్తంభాలు విరిగిపోయాయి. కొన్ని చెట్లు నేలకొరిగాయి. పరిగి మండలంలో పలుచోట్ల విద్యుత స్తంభాలు నేలకూలి విద్యుత సరఫరాకు అంతరాయం కలిగింది.
లోతట్టు ప్రాంతాలు జలమయం
పెనుకొండ: పట్టణంలో ఆదివారం సాయంత్రం 6.30 గంటల నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురుసింది. సాయంత్రం ఉరుములు, మెరుపులతో చిరుజల్లులు ప్రారంభమై... భారీ వర్షం పడింది. వర్షం కురుస్తుండటం తో విద్యుత సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలైన రా మమందిరం, పంచాంగం వీధి, కుమ్మరదొడ్డి, గడంగ్‌వీధి వర్షం నీటితో జలమయమయ్యాయి. గత మూడు నెలలుగా ఎండ వేడిమి భరించలేక తల్లడిల్లుతున్న ప్రజలకు ఈ వర్షంతో ఉపశమనం లభించింది. చిన్న పిల్లలు వర్షం నీటిలో తడుస్తూ చిందులు వేశారు.