ఆదిశేషుడిపై నారసింహుడు
ABN , First Publish Date - 2023-03-09T00:03:00+05:30 IST
శ్రీమత ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీదేవి, భూదేవి సమేతుడైన నారసింహుడు భక్తులకు ఆదిశేష వాహనంపై కనువిందు చేశారు.
కదిరి, మార్చి 8: శ్రీమత ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీదేవి, భూదేవి సమేతుడైన నారసింహుడు భక్తులకు ఆదిశేష వాహనంపై కనువిందు చేశారు. ఉదయం నిత్యపూజ, హోమం అనంతరం యాగశాలనుండి బయలుదేరిన శ్రీవారు తిరువీధుల్లో విహరించారు. కదిరి మల్లెల సౌరభాలు వెంటరాగా విద్యుద్ధీపకాంతుల నడుమ స్వామివారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తిరువీధుల్లో బారులుదీరారు. ఈ ఉత్సవంలో ఆలయ కమిటీ చైర్మన జెరిపిటి గోపాలకృష్ణ, ఆలయ ధర్మకర్తలు, ఆలయ ఈఓ పట్టెం గురుప్రసాద్ పాల్గొన్నారు.
దేవేరులతో దర్శనమిచ్చే ఏకైక ఉత్సవం
సంధ్యాసమయంలో దేవేరులతో కలసి ఆదిశేషుడిపై నరసింహస్వామి దర్శనమివ్వడం ఉత్సవాలకు ఓ ప్రత్యేకత ఉంది. పక్షం రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో నరసింహస్వామి మాత్రమే దర్శనమిస్తారు. కానీ ఒక్క ఆదిశేషవాహనోత్సవంలో మాత్రమే నరసింహస్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరువీధుల్లో విహరిస్తారు. పాలసంద్రాన ఆదిశేషుడిపై పవళించడం శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన అంశం. శ్రీమహావిష్ణు దశావతారాల్లో ఒక్కటైన నారసింహుడు ఆదిశేషుడిని ఏరికోరి మరీ తన వాహనంగా మార్చుకున్నారని పురాణాలు చెబుతున్నాయి.
నేడు సూర్య, చంద్ర ప్రభ వాహనం
శ్రీవారి వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారు సూర్య, చంద్రప్రభ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం వేళ సూర్యప్రభ, రాత్రి సమయంలో చంద్ర ప్రభ వాహనాలపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.