షెడ్డు కట్టి.. అప్పులపాలు..!
ABN , First Publish Date - 2023-02-20T23:57:59+05:30 IST
జిల్లా రైతుకు వ్యవసాయంలో ఎలాగూ ఏటా నష్టాలు.. అప్పులు తప్పట్లేదు. వారిని అప్పుల బారి నుంచి గట్టెక్కించాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వమే.. వారితో కొత్తరకంగా అప్పులు చేయించి, అగాథంలోకి నెడుతుండడం శోచనీయం.
మినీ గోకులం షెడ్లకు అందని బిల్లులు
అప్పులు చేసి.. నిర్మాణాలు పూర్తిచేసిన రైతులు
రెండేళ్లుగా బిల్లుల కోసం ఎదురుచూపు
మడకశిరటౌన, ఫిబ్రవరి 20: జిల్లా రైతుకు వ్యవసాయంలో ఎలాగూ ఏటా నష్టాలు.. అప్పులు తప్పట్లేదు. వారిని అప్పుల బారి నుంచి గట్టెక్కించాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వమే.. వారితో కొత్తరకంగా అప్పులు చేయించి, అగాథంలోకి నెడుతుండడం శోచనీయం. రైతుల పశువులకు రక్షణగా గోకులం పథకానికి టీడీపీ హయాంలో శ్రీకారం చుట్టారు. పథకం కింద పశువుల షెడ్డు నిర్మించుకునే రైతుకు 90 శాతం ప్రభుత్వం సబ్సిడీ చెల్లిస్తుంది. దీంతో చాలామంది రైతులు ముందుకొచ్చారు. అప్పులు చేసి, షెడ్లు నిర్మించుకున్నారు. వైసీపీ అధికారం చేపట్టాక పథకాన్ని అటకెక్కించడంతోపాటు అప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న వాటికి సైతం బిల్లులు మంజూరు చేయలేదు. దీంతో రెండేళ్లుగా బిల్లుల కోసం అన్నదాతలు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. అప్పులు చేసి, షెడ్లు కట్టుకున్న వారు వాటికి వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వ్యవసాయ అప్పులతో విలవిల్లాడుతున్న తమపై ప్రభుత్వమే కొత్త రకం అప్పు మోపడం ఏంటని రైతులు వాపోతున్నారు.
నిర్మాణాలు పూర్తయినా..
పాడిపశువులకు సరైన సంరక్షణ కల్పించడం, రైతుకు భారం కారాదన్న ఉద్దేశంతో ప్రభుత్వం మినీ గోకులం షెడ్ల నిర్మాణాలు చేపట్టింది. రైతులు షెడ్లు నిర్మించుకుంటే 90 శాతం సబ్సిడీ చెల్లిస్తుంది. జిల్లాలో 29 మండలాలకుగాను 578 మినీ గోకులం షెడ్లు మంజూరయ్యాయి. 105 షెడ్ల నిర్మాణం పూర్తయింది. 461 షెడ్లు వివిధ దశల్లో ఉన్నాయి. డివిజన పరిధిలో మినీ గోకులం పథకం కింద 11 మండలాల్లో 158 షెడ్ల నిర్మాణానికి రూ.2.62 కోట్లు మంజూరయ్యాయి. 158 షెడ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటివరకు అధికారులు బిల్లుల రూపేణా రూ.46.8 లక్షలు మాత్రమే చెల్లించారు. డివిజన పరిధిలో 11 మండలాల్లో మినీగోకులం 158 షెడ్లు, పౌలీ్ట్ర షెడ్డు ఒకటి, గొర్రెల షెడ్లు 10 మంజూరయ్యాయి. ఇందులో మినీ గోకులం మడకశిర మండలంలో 52, అగళి 15, రొళ్ల 9, అమరాపురం 10, గుడిబండ 10, గోరంట్ల 22, సోమందేపల్లి 1, లేపాక్షి 12, చిలమత్తూరు 8, లేపాక్షి మండలంలో ఒక పౌలీ్ట్రషెడ్డు, గొర్రెల షెడ్లు 12 మంజూరయ్యాయి. 6 పశువులు ఉన్న షెడ్డుకు రూ.1.80 లక్షలు, నాలుగు ఉంటే రూ.1.50 లక్షలు, రెండింటికి రూ.లక్ష కేటాయించారు. కొన్నిచోట్ల షెడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. బిల్లులు మాత్రం అందలేదు. దీంతో రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయినా బిల్లులు మంత్రం అందట్లేదు. దీంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు.
అప్పు చేసి షెడ్డు నిర్మాణం చేపట్టా
మినీగోకులం షెడ్డు మంజూరవడంతో అప్పు చేసి, నిర్మాణం చేపట్టా. లక్ష రూపాయల షెడ్డుకు గాను రూ.42వేలు మాత్రమే మంజూరైంది. మిగతా బిల్లు రాలేదు. కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. ఇప్తటికైనా అధికారులు మిగతా బిల్లు చెల్లించాలి.
- జగన్నాథ్, ఆర్.రాయాపురం, గుడిబండ మండలం
నిధులు విడుదలవగానే చెల్లిస్తాం
జిల్లాలో మినీ గోకులం షెడ్లకు సంబంధించి పార్టు బిల్లులు చెల్లించారు. నిధులు మంజూరైన వెంటనే మిగతా బిల్లులు కూడా చెల్లిస్తాం. ఆ సొమ్ము నేరుగా రైతు ఖాతాల్లోకి జమవుతాయి. బిల్లుల వెరిఫికేషన కూడా పూర్తయింది.
- శుభదాస్, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి