NARA LOKESH: పోలవరం పూర్తి చేసేది చంద్రబాబే

ABN , First Publish Date - 2023-04-09T03:20:23+05:30 IST

జగన్‌ రెడ్డి ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల మోములో సంతోషాన్ని నింపడమే లక్ష్యంగా పనిచేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.

NARA LOKESH: పోలవరం పూర్తి చేసేది  చంద్రబాబే

గోదావరి మిగులు జలాలను రాయలసీమకు తెస్తాం

సాంకేతికతతో వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం

ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నన్ను నిలదీయండి: నారా లోకేశ్‌

అనంతపురం, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): జగన్‌ రెడ్డి ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల మోములో సంతోషాన్ని నింపడమే లక్ష్యంగా పనిచేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. యువగళం 64వ రోజు పాదయాత్రలో భాగంగా శనివారం అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని జంబులదిన్నె విడిది కేంద్రం వద్ద ఆయన రైతులతో సమావేశం నిర్వహించారు. వేలాది మంది రైతులు హాజరైన ఈ కార్యక్రమానికి ఎస్కేయూ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ రాంప్రసాద్‌ సంధానకర్తగా వ్యవహరించారు. పలువురు రైతులు అడిగిన ప్రశ్నలకు లోకేశ్‌ సూటిగా సమాధానమిచ్చారు. వ్యవసాయ రంగంపై టీడీపీ విధివిధానాలను రైతుల ముందుంచారు. వచ్చేది మన ప్రభుత్వమేనని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ధ్యేయంగా ముందుకు సాగుతామని రైతుల్లో భరోసా నింపారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ పోలవరాన్ని 72శాతం పూర్తి చేసింది చంద్రబాబే అన్నారు. ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పి జగన్‌ నాలుగు తేదీలు ఇచ్చాడని, ఇంతవరకూ ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదని ఎద్దేవా చేశారు. జగన్‌ పని అయిపోయిందని, వచ్చేది మన ప్రభుత్వమేనన్నారు.

గ్రావిటీ ద్వారా విశాఖకు, రాయలసీమకు నీళ్లిస్తామని చెప్పారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు సంబంధించి మిగిలిన పదిశాతం పనులు పూర్తి చేస్తామన్నారు. పోలవరం మిగులు జలాలను అందించి సీమ రైతులకు సాగునీరే కాకుండా ఇంటింటికీ తాగునీటిని అందించే బాధ్యత టీడీపీ తీసుకుంటుందన్నారు. అధికారంలోకి రాగానే రాయలసీమ పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. టెక్నాలజీ అనుసంధానంతో వ్యవసాయాన్ని లాభసాటి చేస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రైతుల మోములో ఆనందం చూసినప్పుడే తన పాదయాత్ర విజయవంతమైనట్లుగా భావిస్తానని లోకేశ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో 70శాతం ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, వారికి అండగా నిలబడటం తన బాధ్యతని లోకేశ్‌ స్పష్టం చేశారు.

ఆ రైతు ఆవేదన కలచివేసింది

యువగళం పాదయాత్రలో ఓ రైతును కలిశాని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎరువులు, పురుగుల మందుల పెట్టుబడులు పెరగడంతో రూ.12.5 లక్షల అప్పులు చేశానని తన బాధను వ్యక్తపరిచాడన్నారు. ఆరు నెలల క్రితం ఆ రైతు భార్య కేన్సర్‌తో చనిపోయిందని, ఆ బాధ ఒకవైపు... అప్పుల బాధ మరోవైపు... మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తే ఆత్మహత్యే శరణ్యమని ఆ రైతు చెప్పిన మాటలు తనను తీవ్రంగా కలచివేశాయని లోకేశ్‌ ఆవేదన చెందారు. అన్నమయ్య జిల్లాలో భారీ వరదలు వచ్చి, పంటలు నాశనమైతే.. కనీసం బాధిత రైతులను స్థానిక ఎమ్మెల్యేలు పరామర్శించలేదని, వారికి నష్టపరిహారం అందించలేదని మండిపడ్డారు. జగన్‌ పాలనలో 9 తుఫాన్లు వచ్చాయని, రైతులు తీవ్రంగా నష్టపోయారని లోకేశ్‌ అన్నారు. బాధిత రైతులకు అరకొర పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. గతంలో రైతులను ఆదుకున్న విధానాలను పునరుద్ధరిస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చారు.

రైతులపై ప్రేమ పెరిగింది

రైతు సమస్యలపై లోకేశ్‌ను కార్యక్రమ సంధానకర్త రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ రాంప్రసాద్‌ పలు ప్రశ్నలు అడిగారు. వాటికి ఆయన సమాధాలు ఇచ్చారు. రైతుల ఇబ్బందులను తెలుసుకున్న తరువాత వారిపట్ల మరింత ప్రేమ పెరిగిందన్నారు. వారికి జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసి, అధికారంలోకి వచ్చాక రైతులకు వెన్నెముకలా నిలబడాలని బలంగా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. పాదయాత్రలో రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే తనను నిలదీయాలని సూచించారు. హామీలను నెరవేరిస్తే తనను అభినందించాలని కోరారు. వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు, ట్రాక్టర్లు, యంత్రపరికరాలను రైతుల ఇళ్ల వద్దకే పంపేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులతో పాటు కౌలు రైతులను అన్ని విధాలుగా ఆదుకునే కార్యచరణను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ‘నందమూరి తారకరామారావు వేషధారణలో ఓ సం పూర్ణ రైతు కనిపించారు. ఆ వస్త్రధారణ మీరు అవలంబిస్తారా?’ అని రాంప్రసాద్‌ అడిగిన ప్రశ్నకు లోకేశ్‌ బదులిస్తూ.. రైతులకు సంపూర్ణ న్యాయం చేసిన నాడు తాను కచ్చితంగా రైతన్న వస్త్రధారణ చేస్తానని, అప్పుడే తనకు పూర్తి సంతృప్తి కలుగుతుందన్నారు.

దేవాన్ష్‌ వ్యవసాయం చేస్తానంటే ప్రోత్సహిస్తా

తన కుమారుడు దేవాన్ష్‌ వ్యవసాయం చేస్తానంటే స్వాగతిస్తానని, ప్రోత్సహిస్తానని లోకేశ్‌ చెప్పారు. తనకున్న అనుభవం దృష్ట్యా సలహాలు ఇస్తానన్నారు. వ్యవసాయాన్ని టెక్నాలజీతో అనుసంధానం చేసి, లాభసాటిగా మార్చడం నేర్పిస్తానని, తండ్రిగా అది తన బాధ్యత అన్నారు.

అన్నదాతకు భరోసా ఎక్కడ?

ఈ రోజు అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం జంబులదిన్నె విడిది కేంద్రంలోనే ఉండి రైతులు పడుతున్న కష్టాలు తెలుసుకున్నాను. ఏ రైతు నోట విన్నా కన్నీటి గాథలే. ఈ ఏడాది రాష్ట్రంలో ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా సాగు విస్తీర్ణం తగ్గిపోయిందని పత్రికల్లో వార్తలు చూసి ఆందోళన చెందాను. 2022-23 ఖరీ్‌ఫ-రబీ సీజన్‌లలో 16.20 లక్షల ఎకరాల పంటల విస్తీర్ణం తగ్గిపోతే... 2022-23 సోషియో ఎకనామిక్‌ సర్వేలో మాత్రం ఆర్థిక మంత్రి బుగ్గన వ్యవసాయంలో 20.72 శాతం వృద్ధిరేటు అంచనా వేయడం ఆశ్చర్యం కలిగించింది. కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు బాపట్ల, నెల్లూరు, చివరకు ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో క్రాప్‌ హాలిడే ప్రకటించారు. వారికి భరోసా కల్పించడంలో విఫలమైన దద్దమ్మ ప్రభుత్వం, వ్యవసాయంలో గణనీయమైన వృద్ధిరేటు సాధించామని డబ్బాలు కొట్టుకోవడాన్ని ఏమనాలో మాటలు రావడం లేదు. ఏ రైతును కదిలించినా కష్టాలు, కన్నీళ్లే సమాధానంగా వస్తున్నాయి. రైతన్నలంతా చైతన్యవంతులై వాస్తవాలను గమనించి.. మీకోసం పనిచేసే చంద్రన్నను సీఎం చేసేందుకు మీవంతు సహకారం అందించాలని కోరుతున్నాను.

Updated Date - 2023-04-09T03:20:23+05:30 IST