వాన జాడే లేదు...
ABN , First Publish Date - 2023-06-15T00:06:16+05:30 IST
ఖరీఫ్ ఆరంభంలోనే రైతులు చినుకు కోసం ఆకాశంపైపు ఎదుర చూస్తున్నారు. మృగశిర కార్తె కూడా నిరాశపర్చింది.
మృగశిర కార్తెలోనూ నిరాశే...
అదునులో విత్తుకు ఆటంకం
ఖరీఫ్ ఆరంభంలోనే రైతుల్లో ఆందోళన
నంబులపూలకుంట, జూన 14: ఖరీఫ్ ఆరంభంలోనే రైతులు చినుకు కోసం ఆకాశంపైపు ఎదుర చూస్తున్నారు. మృగశిర కార్తె కూడా నిరాశపర్చింది. ఆరుద్ర కార్తెలో వర్షంపై ఆశలు పెట్టుకున్నారు. మృగశిరలో విత్తులు, ఆరుద్రలో కలుపు తీయాల్సి ఉందని మండల రైతులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు ఆలస్యంకావడంతో ఎండలు మండుతున్నాయి. సాగుకు రైతులు వెనుకడుగు వేసే పరిస్థితులు ఉన్నాయి. గత యేడాది నంబులపూలకుంటలో 21044.12 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగుచేశారు. గత నెలలో కురిసిన కొద్దిపాటి వర్షానికి రైతులు విత్తనాలు విత్తారు. సరైన అదును లేక ఇంకా మొలకెత్తకపోవడంతో ఆందోళనలో పడ్డారు. అందుబాటులో ఉన్న కొందరు రైతులు బోరుబావుల నుంచి నీటి తడులిస్తున్నారు. నెలరోజులుగా వర్షం కురవకపోవడంతో వేరుశనగ పంట వాడుముఖం పడుతోంది. దిక్కుతోచక రైతులు వర్షం కోసం ఆకాశంవైపు ఆశగా చూస్తున్నారు. పగటిపూట ఎండ వేడి అధికంగా ఉంటూ, సాయంత్రం ఉరుములు, గాలులు వీస్తున్నాయి. వాన జాడ మాత్రం లేదు. పంట తొలి దశలోనే ఎండిపోయే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మరికొంతమంది రైతులు సాగుకు అప్పులు చేసి, విత్తడానికి సిద్ధంగా ఉన్నారు. దుక్కులు చేసుకోవడం కొంత ఆలస్యం కావడంతోసకాలంలో వర్షాలు కురుస్తాయని, మృగశిర కార్తెలో సాగుచేస్తే పంట దిగుబడి ఉంటుందని ఎదురు చూస్తున్నారు. కార్తె దాటాక విత్తనాలు వేసినా పంట ఆశించిన స్థాయిలో రాదని చెబుతున్నారు. అరకొరగా బోర్లలో నీరుండడంతో సాగుచేసిన పంటలకు నీరు అందించలేక వాడుముఖం పట్టాయి. పంట దిగుబడి ఆశాజనంగా రాదని రైతులు లబోదిబోమంటున్నారు.
వర్షం కోసం ఎదురు చూస్తున్నాం...
- రామక్రిష్ణారెడ్డి, ఎగువ తూపల్లి
ఎనిమిది ఎకరాల భూమి ఉంది. మూడు ఎకరాల్లో వర్షాధారం కింద వేరుశనగ సాగుకు దుక్కులు చేశా. విత్తనాలు సిద్ధం చేసుకుని వర్షం కోసం ఎదురు చూస్తున్నా. మృగశిర కార్తె పోతోంది. చినుకు జాడ కనిపించలేదు. ఈకార్తె పోయేలోపు వర్షం కురవకపోతే విత్తనాలు అమ్ముకోవాల్సిందే. ఇలా అయితే పంటలు ఎలా సాగుచేసి, బతకాలి.
అడుగంటిన బోరుబావి
- నాగరాజు, వంకమద్ది
ఐదు ఎకరాల పొలం ఉంది. దుక్కి చేసి, విత్తడానికి సిద్ధంగా ఉన్నా. వ్యవసాయ బోరులో నీరు అరకొరగా వస్తున్నాయి. ఆనీటితో భూమిని తడిపి, విత్తు కష్టంగా ఉంటుంది. ఎండలు, వేడి అధికంగా ఉన్నాయి. భూమిని తడిపిన మరుసటి రోజుకే తడి ఆరిపోతోంది. వర్షం వస్తే ఒకేసారి విత్తవచ్చు. పంటలు సాగుచేయాలో, లేదో అని ఆందోళనలో ఉన్నాం.
నెలాఖరు వరకు వేరుశనగ విత్తుకోవచ్చు
- లోకేశ్వర్‌రెడ్డి, ఏఓ, నంబులపూలకుంట
ఈనెలాఖరు వరకు వేరుశనగ విత్తుకోవచ్చు. రైతులు తొదరపడి విత్తనాలు అమ్ముకోవద్దు. ప్రతి రైతు తొలకరి వర్షానికి పొలాన్ని దుక్కి చేసి ఉంచుకుంటే, పంటలకు చీడపీడలు ఆశించవు. పంటకు తడులిస్తుంటే, రుతుపవనాలు వచ్చి, పంటలు ఆశాజనంగా ఉంటాయి.