పెనుకొండ ఎమ్మెల్యే అవినీతి అనకొండ
ABN , First Publish Date - 2023-03-28T00:17:19+05:30 IST
పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ అవినీతి ఆనకొండ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. బహిరంగ సభలో ఎమ్మెల్యే అవినీతి చిట్టాను చదివి వినిపించారు.
నారా లోకేశ ఫైర్
హిందూపురం, మార్చి 27: పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ అవినీతి ఆనకొండ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. బహిరంగ సభలో ఎమ్మెల్యే అవినీతి చిట్టాను చదివి వినిపించారు. సొంత పార్టీ నేతలే మా కొద్దూ అవినీతి ఆనకొండ అని ధర్నాలు చేస్తున్నారని, ఆయన అవినీతి ఏ స్థాయిలో ఉందో దీన్నిబట్టి అర్థం చేసుకోవాలని లోకేశ అన్నారు. ‘పాపాల పెద్దిరెడ్డి ఇటీవల నియోజకవర్గ సమీక్షకు వచ్చినప్పుడు వైసీపీ కార్యకర్తలే చెప్పులు విసిరారు. ఈ దారుణమైన పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కడ లే ఔట్ వేసినా ఎమ్మెల్యే, ఆయన సోదరులు ఎకరాకి రూ.10 లక్షలు వసూలు చేస్తున్నారు. పెన్నా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ లక్షలు వెనకేసుకుంటున్నారు. కర్ణాటక నుంచి డీజిల్ తెచ్చి లక్షలు సంపాదిస్తున్నారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో రోడ్లకు గుంతలు కూడా పూడ్చలేదు. రాష్ట్ర చరిత్రలో ఒక రోడ్డు కూడా వేయకుండా మంత్రిగా పనిచేసిన ఘనత ఆయనది. శంకర నారాయణను గిన్నిస్ బుక్‌లో చేర్చాలి’ అని విమర్శలు గుప్పించారు. అవినీతి సొమ్ముతో ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకున్నాడని, దానికి అండర్ డ్రైనేజ్ కూడా ఏర్పాటుచేసుకున్నాడని అన్నారు. కియ కార్మికులను కూడా దోచుకుంటున్నారని, కియ క్యాంటీన నుంచి తుక్కు వ్యాపారం వరకు ఎమ్మెల్యే సోదరులే చూస్తున్నారని అన్నారు. వారి ఆగడాలను భరించలేక కియ అనుబంధ పరిశ్రమలు తమిళనాడుకి తరలివెళ్లాయని అన్నారు. పేదల పక్కా ఇళ్ల పేరిట రూ.200 కోట్లు కొట్టేశారని, సొంత పార్టీ నేతలే ఈయన అవనీతి బాగోతంపై లేఖ రాశారని అన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు అమర్‌నాథరెడ్డి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, నెల్లూరు జిల్లా నాయకుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, నాయకులు అంబికా లక్ష్మీనారాయణ, పూల నాగరాజు, గుండుమల తిప్పేస్వామి, ఈరన్న, వెంకట శివుడు యాదవ్, నర్సానాయుడు, కొల్లకుంట అంజినప్ప, వడ్డె వెంకట్, స్వరూప తదితరలు పాల్గొన్నారు.