నాడు అంతే. నేడూ అంతే..!
ABN , First Publish Date - 2023-06-14T00:47:51+05:30 IST
నాడు-నేడు రెండో విడత పథకం కింద మరమ్మతు కోసం ఉమ్మడి జిల్లాలో 150కి పైగా సంక్షేమ వసతి గృహాలను 2019లో ఎంపిక చేశారు. నిధుల కొరత, ఇతర సమస్య కారణంగా వాటిని మూడో విడతకు బదలాయించారు. ఆ తరువాత కూడా అవే సమస్యలు ఉత్పన్నమయ్యాయి.
వసతి గృహాల్లో అవే సమస్యలు
శిథిలావస్థలోహాస్టల్ భవనాలు
కూలిన ప్రహరీలు.. పందుల సంచారం
తాగునీరు లేదు.. మరుగుదొడ్లు లేవు
సెలవులు ముగిసి.. విద్యార్థి హాస్టల్ బాట..
సెలవులు ముగిశాయి. బడి తెరిచారు. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటూ చదువుకునే పేద విద్యార్థులు పెట్టె సర్దుకుని.. ఇక ఒక్కొక్కరుగా వచ్చేస్తారు. ఇంకో ఏడాది వీరందరూ బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందేనా..? అనే అనుమానం కలుగుతోంది. అన్ని సంక్షేమ శాఖల పరిధిలో వసతి గృహ భవనాలు శిథిలావస్థకు చేరాయి. చాలావాటికి ప్రహరీలు లేవు. తాగునీరు లేదు. మరుగుదొడ్లు లేవు. భద్రత లేదు. ఇలాంటి వాతావరణంలో వసతి పొందడం.. దినదిన గండమే. ప్రభుత్వం వసతి గృహాల మరమ్మతులకు నిధులు ఇవ్వడంలేదు. నాడు-నేడు పేరిట ప్రచారం చేసుకుంటోంది తప్ప.. విద్యార్థుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు.
- అనంతపురం ప్రెస్‌క్లబ్
నేటికీ పూర్తికాని నాడు-నేడు
నాడు-నేడు రెండో విడత పథకం కింద మరమ్మతు కోసం ఉమ్మడి జిల్లాలో 150కి పైగా సంక్షేమ వసతి గృహాలను 2019లో ఎంపిక చేశారు. నిధుల కొరత, ఇతర సమస్య కారణంగా వాటిని మూడో విడతకు బదలాయించారు. ఆ తరువాత కూడా అవే సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఫలితంగా వసతిగృహాల మరమ్మతు అటకెక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్ల దుస్థితిపై ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు రావడంతో, ప్రభుత్వం స్పందించింది. వసతిగృహాల మరమ్మతు కోసం ‘ప్రత్యేక నాడు-నేడు’ను తీసుకొచ్చింది. ఇక్కడ కూడా ఫేజ్-1, ఫేజ్-2గా విభజించింది. జిల్లాలో కూలేందుకు సిద్ధంగా ఉన్న వసతిగృహాల స్లాబ్‌లు, మరుగుదొడ్లు, ప్రహరీలు, ఎలక్ర్టికల్, మెస్ తదితర సమస్యలతో సతమతమవుతున్న వసతిగృహాల వివరాలను సంక్షేమ శాఖల అధికారులు రాష్ట్రస్థాయి అధికారులకు పంపారు. జిల్లాలో బీసీ సంక్షేమశాఖ అధికారులు 32 వసతి గృహాలను మరమ్మతులకు ఎంపిక చేసి ఇంజనీర్లకు నివేదికలు పంపారు. ఎస్సీ సంక్షేమశాఖ దాదాపు 36 వసతి గృహాలను, ఎస్టీ సంక్షేమశాఖలో రెండు వసతి గృహాలు, ఒక రెసిడెన్షియల్ పాఠశాలను ఎంపిక చేసి నివేదికలు పంపారు. ఏడాది కావస్తున్నా ఇంత వరకూ కదలిక లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని సమాచారం.
ఇదీ.. పరిస్థితి
- అనంతపురం నగరంలో ఎస్సీ బాలికల నెం-2 వసతిగృహం భవనం పైకప్పు పెచ్చులూడుతోంది. మూడేళ్లుగా సమస్య ఉంది. విద్యార్థులు బిక్కుబిక్కుమని ఆ గదుల్లోనే గడుపుతున్నారు.
- అనంతపురం నగరంలోని గిల్డాఫ్ సర్వీస్ స్కూల్ పక్కనున్న బీసీ నెం-1, నెం-2, ఎస్సీ బాలికల స్కూల్, కాలేజీ హాస్టళ్ల సమూహం ప్రహరీ కూలిపోయింది. నాలుగేళ్లుగా అలాగే వదిలేశారు. దీంతో విద్యార్థినులకు భద్రత కరువైంది.
- రాప్తాడులోని బీసీ బాలుర వసతి గృహం గదులు చిన్నపాటి వర్షానికి కారుతున్నాయి. విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
- హంపాపురం బీసీ బాలుర వసతిగృహంలో సమస్యలు తిష్ట వేశాయి. మూడేళ్లుగా ఆ శాఖ నుంచి నిర్వహణ నిధులు రాలేదు. విద్యార్థులకు తాగునీరు లేదు. బోరునీటినే తాగుతున్నారు. వసతిగృహానికి ప్రహరీ లేదు. ఆవరణలో పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు పెరిగాయి. చుట్టుపక్కల ఉన్నవారు అక్కడ చెత్త వేస్తున్నారు. దీంతో విషపురుగులు సంచరిస్తున్నాయి.
- శింగనమల ఎస్సీ బాలుర వసతిగృహంలో మరుగుదొడ్ల సమస్యతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. నీటి సౌకర్యం లేక మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. ఆరు బయటే స్నానాలు, కాల కృత్యాలు తీర్చుకుంటున్నారు.
- గుత్తి మండలం ఇసురాళ్లపల్లి బీసీ వసతి గృహంలో గదుల పైకప్పు పెచ్చులు ఊడిపడుతున్నాయి. భవనం శిథిలావస్థకు చేరింది. ప్రహరీ, భవనం మరవ కట్ట పడిపోయాయి.
- గుత్తిలోని కొండ కింద ఉన్న బీసీ బాలుర వసతిగృహ భవనం శిథిలమైంది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. సరైన ప్రహరీ లేక పందులు చొరబడుతున్నాయి. విష పురుగులు సంచరిస్తున్నాయి.
- బెళుగుప్ప బీసీ బాలుర వసతి గృహంలో నీటి సౌకర్యం లేక మరుగుదొడ్లు నిరుపయోగంగామారాయి.