బడిలో నీటి కష్టాలు

ABN , First Publish Date - 2023-02-11T00:04:39+05:30 IST

నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తామనీ, ప్రైవేటుకు దీటుగా అభివృద్ధి చేస్తామని సీఎం జగన ఆర్భాటపు ప్రకటనలు చేశారే తప్ప.. క్షేత్రస్థాయిలో అమలుకాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి విద్యార్థులకు కనీసం నీటి కష్టాలు తీరలేదు.

బడిలో నీటి కష్టాలు

-పలు పాఠశాలల్లో పూర్తికాని ఆర్వో ప్లాంట్ల పనులు

- ఏర్పాటు చేసినా.. కనెక్షన ఇవ్వని దుస్థితి

- తాగునీటికి విద్యార్థుల అవస్థలు

- ప్లేట్లు కడుక్కునేందుకు చేతిపంపుల వద్దకు..

గాండ్లపెంట, ఫిబ్రవరి 10: నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తామనీ, ప్రైవేటుకు దీటుగా అభివృద్ధి చేస్తామని సీఎం జగన ఆర్భాటపు ప్రకటనలు చేశారే తప్ప.. క్షేత్రస్థాయిలో అమలుకాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి విద్యార్థులకు కనీసం నీటి కష్టాలు తీరలేదు. నాడు-నేడు కింద కొన్ని పాఠశాలలకు ఆర్వో ప్లాంట్లు వచ్చినా.. వాటికి కనెక్షన ఇచ్చే నాథుడు లేడు. మరమ్మతులకు వస్తే.. మూలన పడేస్తున్నారు. మధ్యాహ్న భోజనం చేసిన తరువాత ప్లేట్లు, చేతులు కడుక్కునేందుకు విద్యార్థులు చేతిపంపుల వద్దకు పరుగులు తీయాల్సి వస్తోంది. మరికొన్నిచోట్ల మరుగుదొడ్లలో కూడా నీరు లేదు.

ప్రారంభోత్సవాలతో సరి..

మండలవ్యాప్తంగా 49 ప్రాథమిక, 4 ప్రాథమికోన్నత, 5 ఉన్నత పాఠశాలలు, 1 కేజీబీవీ కలిపి మొత్తం 59 ఉన్నాయి. వీటిలో 2,250 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మొదటి విడత నాడు-నేడు కింద 11 పాఠశాలలను ఎంపిక చేశారు. వాటిలో నాణ్యమైన భోజనంతోపాటు ఆర్వోప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు పలుచోట్ల ఏర్పాటు చేసి, లక్షలాది రూపాయలు ఖర్చు చేసి, ప్రారంభోత్సవాలు చేశారు. ఆ తరువాత వాటిని వదిలేశారు. కొన్నిచోట్ల కనీసం వాటిని అమర్చనేలేదు. మరికొన్నిచోట్ల సాంకేతిక లోపాలతో మొరాయించిన వాటికి మరమ్మతులు చేపట్టలేదు. కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సమయంలో చేతులు శుభ్రం చేసుకోవడానికి నీరు కావాలంటే చేతిపంపుల వద్దకు పరుగులు తీస్తున్నారు. మరికొన్నిచోట్ల విద్యార్థులు గ్రామంలో ఉన్న సత్యసాయి ట్యాంక్‌, చేతిపంపుల వద్ద నుంచి నీటిని తెచ్చుకుని, వాడుకుంటున్నారు. విద్యార్థులు అధికంగా ఉన్నచోట మరుగుదొడ్లకు వెళ్లాలంటే చాలీచాలని నీటితో ఇబ్బందులు పడుతున్నారు. ఇలా మండలవ్యాప్తంగా నీటి కష్టాలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న వేసవిలో నీటి కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉందంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

పనిచేయని ఆర్వో ప్లాంట్లు

మండలవ్యాప్తంగా 11 పాఠశాలల్లో విద్యార్థులకు శుద్ధి నీరు అందించేందుకు నాడు-నేడు కింద లక్షలాది రూపాయలు ఖర్చు చేసి, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశారు. మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాలలో దాదాపు 700 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఏడాది క్రితం ఆర్వో ప్లాంట్లు మంజూరై, జిల్లాపరిషత పాఠశాలలో ఉంచారు. వాటిని ఇంతవరకు అమర్చకపోవడంతో క్యాన్ల ద్వారా నీటిని తాగుతున్నారు. వేపలకుంట ప్రాథమిక, మల్లమీదపల్లి ప్రాథమికోన్నత, గాండ్లపెంట ప్రాథమిక పాఠశాలల్లో సాంకేతిక సమస్యలతో ఆరు నెలలుగా ఆర్వో ప్లాంట్లు పనిచేయలేదని చెబుతున్నారు. వీటి మరమ్మతుల కోసం ఆయా శాఖాధికారులకు తెలిపినా.. పట్టించుకోవడం లేదని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు.

చేతిపంపులే దిక్కు

తాళ్లకాలువ పాఠశాలలో నీటి ట్యాంకులు, కొళాయిలు ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తరువాత చేతులు, ప్లేట్లు శుభ్రం చేసుకోవాలంటే చేతి పంపే దిక్కవుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం కనీసం పంచాయతీ ద్వారా ఒక కొళాయి వేసి, విద్యార్థులకు నీటి సౌకర్యం కల్పించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

మరుగుదొడ్లు, మూత్రశాలలకు బయటి నుంచే నీరు

రెక్కమాను, కురమామిడి, పాలవాండ్లపల్లి, గేదెర్ల తదితర గ్రామాల పాఠశాలల్లో చేతి పంపులు, కొళాయిలు లేకపోవడంతో బయటినుంచి నీటిని తెచ్చుకుని, మరుగుదొడ్లు, మూత్రశాలలకు విద్యార్థులు ఉపయోగిస్తున్నారు. చాలీచాలని నీటితో ఇబ్బందులు పడుతున్నారు. కురమామిడి పాఠశాల మూత్రశాలలో చిన్నపాటి బకెట్లతో నీటిని ఉంచడంతో అవి చాలట్లేదని విద్యార్థులు వాపోతున్నారు.

Updated Date - 2023-02-11T00:04:40+05:30 IST