YuvagalamPadayatra: రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్‌ది 3వ స్థానం: నారా లోకేశ్‌

ABN , First Publish Date - 2023-04-17T19:50:09+05:30 IST

ఒక్క చాన్స్‌ అని అంటే.. నమ్మి మోసపోయి పాలిచ్చే ఆవును కాదని.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు. సీఎం జగన్‌ (CM Jagan) పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యమైంది.

YuvagalamPadayatra: రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్‌ది 3వ స్థానం: నారా లోకేశ్‌

కర్నూలు: ‘ఒక్క చాన్స్‌ అని అంటే.. నమ్మి మోసపోయి పాలిచ్చే ఆవును కాదని.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు. సీఎం జగన్‌ (CM Jagan) పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యమైంది. రైతులకు కనీసం గిట్టుబాటు ధర అందడం లేదు... పెట్టుబడి వ్యయం పెరిగి అప్పులపాలవుతున్నారు.. లాభసాటి వ్యవసాయం కోసం ప్రత్యేక ప్రణాళికను తయారు చేస్తున్నాం... పాదయాత్ర రాయలసీమ దాటేలోగా ప్రణాళికలు ప్రకటిస్తా’మని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) పేర్కొన్నారు. యువగళం పాదయాత్ర (YuvagalamPadayatra) 73వ రోజు కర్నూలు (Kurnool) జిల్లా ఆలూరు నియోజకవర్గం పరిధిలో ఎంకే కొట్టాల నుంచి ప్రారంభమైంది. గుళ్లకొండ, గుమ్మిరాళ్ల, బుర్రకుంట, వెంకటాపురం దాకా 15 కి.మీ. నడిచారు. ఇప్పటి వరకు 948 కిమీకు చేరుకుంది. లోకేశ్‌తో పాటు ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి కోట్ల సుజాతమ్మ, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు సూర్యప్రకాష్‌రెడ్డి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ (Bhuma Akhila Priya) నడిచారు. వెంకటాపురం వద్ద రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్బంగా నారా లోకేశ్‌ మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వ వైఫల్యాల కారణంగా రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం 3వ స్థానంలో ఉందని, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానానికి చేరిందని పేర్కొన్నారు.

వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడితే పగులగొట్టండి

జగన్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసింది. రూ.11 లక్షల కోట్లు అప్పులు చేశారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల ఏర్పాటుకు రైతులతో అగ్రిమెంట్లు తీసుకుంటున్నారు. ఆ అగ్రిమెంట్లను తాకట్టు పెట్టి అప్పు తెచ్చే అవకాశం ఉంది. అగ్రిమెంట్ల మీద సంతకం పెట్టవద్దని, బలవంతంగా మీటర్లు పెడితే.. పగులగొట్టాలని, యువనేత రైతులకు సూచించారు. టీడీపీ అధికారంలోకి రాగానే వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ పాత విధానంలోనే కొనసాగిస్తామని తెలిపారు. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వ్యవసాయ మంత్రి కాకాని ఏ ఒక్క రోజూ కూడా రైతుల వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకోలేదని పేర్కొన్నారు. ఏడాదిగా పంటల బీమా సొమ్ము రైతులకు ఇవ్వకపోయినా సీఎం జగన్‌, వ్యవసాయ మంత్రి కాకాని కనీసం సమీక్ష కూడా నిర్వహించకపోవడం దారుణమని ఎద్దేవా చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే రూ.50వేల లోపు రుణాలన్నింటినీ ఒక్క సంతకంతో చంద్రబాబు రద్దు చేశారని, ఆ పై రుణాలకు 3 విడతల డబ్బు రైతుల ఖాతాల్లో వేశారని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు పెట్టుబడి తగ్గించే చర్యలు చేపడతామని, ఉద్యాన పంటల సాగును ఉపాధి హామీతో అనుసంధానం చేస్తామని చెప్పారు. సబ్సిడీపై పశుగ్రాసం అందిస్తామని, మరో ఏడాదిలో చంద్రన్న ప్రభుత్వం వస్తుందని, వ్యవసాయం మళ్లీ పచ్చగా కళకళలాడుతుందని లోకేశ్‌ భరోసా ఇచ్చారు.

Updated Date - 2023-04-17T19:50:09+05:30 IST