Anam: ఆనం రామనారాయణరెడ్డికి మరో షాక్

ABN , First Publish Date - 2023-01-19T17:12:39+05:30 IST

వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy)కి మరో షాకిచ్చారు. 'గడపగడపకు'లో ఇప్పటివరకూ అందించిన సహకారం మరువలేనిదని, తమకు ధన్యవాదాలంటూ ...

Anam: ఆనం రామనారాయణరెడ్డికి మరో షాక్

నెల్లూరు: వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy)కి మరో షాకిచ్చారు. 'గడపగడపకు'లో ఇప్పటివరకూ అందించిన సహకారం మరువలేనిదని, తమకు ధన్యవాదాలంటూ ఎమ్మెల్యే ఆనంకు జీఎస్‌‌డబ్ల్యూఎస్ కమిషనర్‌ (GSWS Commissioner) మెసేజ్‌ పంపారు. గడపగడపకు ఇకపై వెళ్లొద్దంటూ ఇన్‌డైరెక్ట్‌గా ఆనంకు సూచించారు. ప్రభుత్వ తీరుపై ప్రశ్నించిన ఆనంకు వైసీపీ (YCP) వరుస వేధింపులకు దిగుతోందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వైసీపీలో ఆనం సీనియర్‌ నేత అయినప్పటికీ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తగిన ప్రాధాన్యత లేదని తొలి నుంచీ అసంతృప్తిగానే ఉంటున్నారు. ఇంతకాలం మౌనంగా వ్యవహరించిన ఆయన ఇటీవల ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, అసంతృప్తి వ్యక్తమయ్యేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. దానికి కారణం రామ్‌కుమార్‌రెడ్డి (Ram Kumar Reddy)కి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ప్రాధాన్యత పెరగడమే కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవలే రామ్‌కుమార్‌రెడ్డి ఏకంగా జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

ఈ పరిణామం ఆనం వర్గాన్ని తీవ్ర అసంతృప్తికి లోను చేసినట్టు సమాచారం. దీంతో ఇటీవల ఒకటి రెండు సందర్భాల్లో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా పలు వ్యాఖ్యలు చేశారు. మూడున్నరేళ్లలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయామని... ఒక ఇల్లు కట్టామా? రోడ్లలో ఏర్పడిన గుంతలపై తట్టెడు మన్ను పోశామా? జనం ఎందుకు ఓట్లు వేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛను ఇచ్చినంత మాత్రాన మనకు ఎందుకు ఓట్లు వేయాలి? ముందు ప్రభుత్వాలు కూడా ఇచ్చాయి కదా? అని ప్రశ్నించారు. అలాగే తనను నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, ఇంకా ఏడాదన్నర పాటు తానే ఎమ్మెల్యేగా వుంటానని కూడా వ్యాఖ్యానించారు. ఈ తీరుతో ఆనం వైసీపీలో కొనసాగడం అనుమానంగా మారింది. దానికి తగ్గట్టు అధిష్ఠానం కూడా వేగంగా స్పందించింది. ఆనం ఇబ్బందికర వ్యాఖ్యలు చేసిన వారం లోపే ఆయన్ను నియోజకవర్గ పార్టీ ఇంఛార్జిగా తొలగించి ఆ స్థానంలో రామ్‌కుమార్‌రెడ్డిని సమన్వయకర్తగా నియమించింది. ఈ పరిణామాలతో ఆనంకు వైసీపీతో బంధం తెగిపోయినట్లేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Updated Date - 2023-01-19T17:12:40+05:30 IST