Vande Bharat Train: వందే భారత్‌ రైలుపై మళ్లీ రాళ్ల దాడి

ABN , First Publish Date - 2023-02-04T20:12:19+05:30 IST

విశాఖపట్నం-సికింద్రాబాద్‌ (Visakhapatnam-Secunderabad)ల మధ్య నడుస్తున్న ‘వందే భారత్‌’ ఎక్స్‌ప్రెస్‌ రైలు (Vande Bharat Train)పై మరోసారి గుర్తుతెలియని వ్యక్తులు...

Vande Bharat Train: వందే భారత్‌ రైలుపై మళ్లీ రాళ్ల దాడి

విశాఖపట్నం: విశాఖపట్నం-సికింద్రాబాద్‌ (Visakhapatnam-Secunderabad)ల మధ్య నడుస్తున్న ‘వందే భారత్‌’ ఎక్స్‌ప్రెస్‌ రైలు (Vande Bharat Train)పై మరోసారి గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. 20833 నంబర్‌ గల రైలు శుక్రవారం సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వస్తుండగా తెలంగాణలోని ఖమ్మం (Khammam) స్టేషన్‌ సమీపాన గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. సీ12 కోచ్‌ అద్దాలు పగిలిపోయాయి. దాంతో రైలు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆలస్యంగా విశాఖపట్నం (Visakhapatnam) చేరుకుంది. ఇక్కడి అధికారులు ఆగమేఘాలపై అద్దాన్ని మార్చి...శనివారం ఉదయం మూడు గంటలు ఆలస్యంగా తొమ్మిది గంటలకు రైలును ఇక్కడి నుంచి పంపించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా రాళ్ల దాడి చేసిన వారిని గుర్తించామని, స్థానిక పోలీసులకు ఆ సమాచారం అందించామని రైల్వే అధికారులు తెలిపారు.

ట్రయల్‌ రన్‌లోనే మొదటి దాడి

ఈ రైలును గత నెల 15వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) వర్చువల్‌ విధానంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి ముందు ట్రయల్‌ రన్‌ కోసం చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ నుంచి విశాఖపట్నం తీసుకువచ్చి, ఇక్కడి నుంచి సికింద్రాబాద్‌ పంపడానికి యత్నించారు. ఈ క్రమంలో 11వ తేదీన రైలు ఇక్కడికి రాగా అదేరోజు రాత్రి నిర్వహణ కోసం కోచింగ్‌ కాంప్లెక్స్‌కు తీసుకువెళుతుండగా, కంచరపాలెం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. అప్పుడు కూడా నిందితులను రైలుకున్న సీసీ టీవీ కెమెరాల ద్వారానే గుర్తించి అరెస్టు చేశారు. ఇప్పుడు అదే రైలుపై రెండోసారి దాడి జరగడం గమనార్హం.

Updated Date - 2023-02-04T20:12:20+05:30 IST