CM Jagan: ఒడిశా రైలు ప్రమాదంపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
ABN , First Publish Date - 2023-06-03T10:29:14+05:30 IST
ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అమరావతి: ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై (Koramandal Express Train Accident) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 233 మందికిపైగా చనిపోవడంపై విచారం తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. మృతులు, క్షతగాత్రుల్లో రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఉన్నారా?.. లేదా? అన్న దానిపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. రైల్వే అధికారులతో నిరంతరం టచ్‌లో ఉన్నామని సీఎంకు అధికారులు తెలిపారు. ఎలాంటి సహాయం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు జగన్ ఆదేశాలు జారీ చేశారు. రైల్వే అధికారుల నుంచి నిరంతరం సమాచారం తెప్పించుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూచించారు.
కాగా.. ఒడిశాలో శుక్రవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్ నుంచి చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు ప్రయాణిస్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ (12841) పట్టాలు తప్పి గూడ్స్ రైలును ఢీకొంది. దాదాపు 15 కోచ్‌లు పట్టాలు తప్పగా.. వాటిలో ఏడు తిరగబడిపోయినట్టు సమాచారం. వాటిలో కొన్ని పక్కనే ఉన్న మరో ట్రాక్‌పై పడ్డాయి. కొద్దిసేపటికి.. ఆ రెండో ట్రాక్ మీదుగా హౌరాకు వెళ్తున్న బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 12864) ట్రాక్‌పై పడి ఉన్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లను ఢీకొంది.
ఆ తాకిడికి బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన నాలుగైదు బోగీలు పట్టాలు తప్పినట్టు సమాచారం. తిరగబడిపోయిన బోగీల కింద వందల మంది చిక్కుకుపోయారు. ఆ బోగీల కింద నుంచి దాదాపు 70 మృతదేహాలను వెలికితీశారు. మృతుల సంఖ్య ఇప్పటికి (జూన్ 3, 2023, 8:40 am) 237కి చేరింది. ఈ ప్రమాదంలో 900 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.