AP News: ఎస్ఐ అభ్యర్థుల వ్యాజ్యంపై హైకోర్ట్ సీరియస్.. సామాజిక సేవను శిక్షగా విధించిన కోర్టు
ABN , Publish Date - Dec 15 , 2023 | 08:51 PM
ఎస్ఐ అభ్యర్థుల ఎత్తు కొలతలకు సంబంధించిన వ్యాజ్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ వైద్యుల నుంచి సర్టిఫికెట్లు తెచ్చుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని అభ్యర్థులను హైకోర్ట్ ధర్మాసనం ప్రశ్నించింది.
అమరావతి: ఎస్ఐ అభ్యర్థుల ఎత్తు కొలతలకు సంబంధించిన వ్యాజ్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ వైద్యుల నుంచి సర్టిఫికెట్లు తెచ్చుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని అభ్యర్థులను హైకోర్ట్ ధర్మాసనం ప్రశ్నించింది. సాక్ష్యాధారాలు సృష్టించి కోర్టును మోసం చేద్దామని అనుకున్నారా అని అభ్యర్థులపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్ట్ ధిక్కరణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ ఉద్యోగాల ప్రక్రియలో పాల్గొనకుండా బ్లాక్ లిస్టులో పెడతామని అభ్యర్థులను తీవ్రంగా హెచ్చరించింది.
భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని క్షమించి వదిలివేయాలని న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ కోర్టును కోరారు. ధర్మాసనానికి క్షమాపణ చెప్పారు. దీంతో శిక్షను సామాజిక సేవగా మలుస్తామని హైకోర్టు చెప్పింది. ప్రభుత్వాసుపత్రులలో సేవ చేయాలని ఆదేశించింది. కోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్ఐ అభ్యర్థులకు ఆదేశం జారీ చేసింది. కాగా ఉత్తర్వుల జారీకి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.