Bopparaju: తుది నిర్ణయం తీసుకుంటాం.. ప్రభుత్వానికి బొప్పరాజు హెచ్చరిక
ABN , First Publish Date - 2023-05-30T15:20:40+05:30 IST
రాబోయే కాలంలో ఉద్యమం అంతా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల దే అని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.
విజయవాడ: రాబోయే కాలంలో ఉద్యమం అంతా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల దే అని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు (AP JAC Amaravati president Bopparaju Venkateshwarulu) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఉద్యమం చేస్తున్నాం కాబట్టే మళ్ళీ ఏసీబీ దాడులు మొదలయ్యాయన్నారు. కార్యాలయంలో కాగితాలు కొనుగోలు చేసేందుకు కూడా డబ్బులు ఇవ్వని ప్రభుత్వం ఏసీబీతో దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. ఏసీబీ దాడుల ద్వారా ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. ఉద్యోగులకూ చట్టబద్ధంగా రావాల్సిన మొత్తాలు ఇవ్వరని, పెన్షనర్‌లకూ పింఛన్ ఇవ్వడం లేదని తెలిపారు. 84 రోజులుగా ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇక తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.
ఉద్యమం ఆగాలంటే ఉద్యోగులు ఇచ్చిన 50 డిమాండ్‌లను పరిష్కరించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. ఉద్యమం తీవ్రతరం అయితే దాని బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట రామిరెడ్డి వినిపించేది ప్రభుత్వ వాదనే అని.. గతంలో ఆయనే ఈ విషయాన్ని ప్రకటించినట్లు చెప్పారు. సచివాలయ ఉద్యోగులకు పీఆర్సీ, ఏరియర్‌లు, డీఏలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు అవసరం లేదా అన్న విషయం వెంకట రామి రెడ్డి తేల్చి చెప్పాలన్నారు. ఆయన మాట్లాడిన విషయాలు అన్ని ప్రభుత్వం మాట్లాడినట్టు గానే భావిస్తున్నామని.. ఇదంతా ప్రభుత్వ కుట్రలో భాగమే అని బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యలు చేశారు.