Minister Roja : మొన్న అలా.. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగితోనే చెప్పులు మోయించిన మంత్రి రోజా..ఎప్పుడూ వివాదాలేనా..?
ABN , First Publish Date - 2023-02-09T17:06:55+05:30 IST
మంత్రి రోజా (Minister Roja) ఎప్పుడూ వివాదాల చుట్టే తిరుగుతుంటారు. ప్రతిపక్ష నేతలపై రోజా తీవ్రమైన విమర్శలు చేస్తుంటారు.
బాపట్ల: మంత్రి రోజా (Minister Roja) ఎప్పుడూ వివాదాల చుట్టే తిరుగుతుంటారు. ప్రతిపక్ష నేతలపై రోజా తీవ్రమైన విమర్శలు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఆమె గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉన్నారనే విషయాన్ని మర్చిపోతుంటారు. గురువారం సూర్యలంక (Surya Lanka) సముద్ర తీరంలో రోజా పర్యటించారు. ఆమె సముద్ర తీరంలో తిరుగుతూ సందడి చేశారు. సముద్ర అలల తాకిడిని ఆస్వాదించారు. ఆమె పర్యాటక శాఖామంత్రి కాబట్టి పర్యాటక ప్రదేశాల్లో సందర్శిస్తూ.. సమీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. సహజంగా నీళ్లతో తిరిగేటప్పుడు కాళ్లకు పట్టు దొరికేందుకు సాధ్యమైనంత వరకు చెప్పులు లేకుండానే దిగితుంటారు. మంత్రి రోజా కూడా సూర్యలంక సముద్ర తీర ప్రాంతంలో నీళ్ల లోకి చెప్పులు లేకుండా దిగారు. అయితే చెప్పులు (Sandals) ఒడ్డును వదిలిపెట్టకుండా పర్యాటక శాఖ ఉద్యోగి నాగరాజుతో మోయించడం వివాదాస్పమవుతోంది. సూర్యలంక రిసార్ట్స్ (Suryalanka Resorts)లో నాగరాజు ఉద్యోగిగా పనిచేస్తున్నారు. నాగరాజు చెప్పులు మోస్తూ మీడియా కంట పడ్డారు... ఇంకేముందీ ఆయన చెప్పులు మోస్తూ ఒడ్డున ఉంటే మంత్రి రోజా సముద్ర అలల్లో చెప్పులు లేకుండా ఆస్వాదిస్తూ తిరిగారు. ప్రస్తుతం చెప్పులు మోస్తున్న దృశ్యాలు సోషల్ మీడియా (Social media)లో వైరల్ అవతున్నాయి. దీంతో రోజాపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మనమింకా ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా? లేకపోతే దొరల రాజ్యంలోఉన్నామా? అని రోజాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లేపాక్షిలోనూ రోజా అధికారదర్పం
ఆ మధ్య లేపాక్షి ఆలయం (Lepakshi Temple)లోనూ రోజా అధికార దర్పాన్ని ప్రదర్శించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీసత్యసాయి జిల్లాలోని లేపాక్షి దుర్గా, వీరభద్రస్వామి ఆలయ సందర్శనలో ఓవరాక్షన్ చేశారన్న విమర్శలు భక్తుల నుంచి వినిపించాయి. లేపాక్షి ఆలయ దర్శనానికి వచ్చారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలోకి మంత్రితోపాటు జనం కూడా వెళ్లారు. దీంతో మంత్రికి కోపం వచ్చింది. తాను వచ్చింది గుడి చూడటానికా.. జనాన్ని చూడటానికా అని పోలీసులపై చిర్రుబుర్రులాడారు. దీంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రధాన ద్వారాన్ని పది నిముషాల పాటు మూసేశారు. సంప్రదాయం మేరకు ప్రధాన ద్వారాన్ని ఉదయం 6.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు తెరిచిఉంచాలి.
గ్రహణ సమయాల్లో తప్ప.. మధ్యలో ఆలయ ద్వారాన్ని మూయరాదు. అలాంటిది మంత్రి సేవలో ఆలయ సంప్రదాయాన్ని తుంగలో తొక్కి ప్రధాన ద్వారాన్ని మూసేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వచ్చారని ఇలా చేయడం సబబు కాదంటూ పోలీసులు, దేవదాయ శాఖపై మండిపడ్డారు. మూలవిరాట్ దర్శనానికి సాయంత్రం మూడు నుంచి ఐదు గంటల వరకు భక్తులను అనుమతించలేదు. మంత్రి ఆగ్రహించడంతో ఆలయం వద్ద ఉన్నవారిని కూడా పోలీసులు తరిమేశారు. మీడియాను కూడా అనుమతించలేదు. ఆలయ ద్వారం మూసేయడంతో లోపల మంత్రి ఫొటోలకు ఫోజులిచ్చుకుంటూ గడిపారు.