Chandrababu : మోసకారి సీఎం
ABN , First Publish Date - 2023-05-18T03:36:06+05:30 IST
రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ వధ చేసి, మళ్లీ గౌరవంగా అసెంబ్లీలో అడుగుపెడతానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.
పేదల కోసం అమరావతిలో
5ు భూమి ఎప్పుడో రిజర్వు చేశాం
ఇప్పుడిస్తానంటున్న సెంటు భూమి
సమాధి కట్టుకోవడానికి తప్ప దేనికి?
పేదలపై ప్రేమ ఉన్నట్లు నాటకాలు
వారి ఉసురు తప్పక తగులుతుంది
ఆయనది ధనబలం.. మాది ప్రజాబలం
అత్యంత సంపన్న ముఖ్యమంత్రి జగన్
రానున్నది కురుక్షేత్ర యుద్ధం
కౌరవ వధ చేసి గౌరవంగా సభలోకి..
నవంబరులో ఎన్నికలకు వెళ్లే యోచన
రేపు పెట్టినా టీడీపీ రెడీ
జగన్ విశాఖకు వస్తే భూములన్నీ మటాషే: చంద్రబాబు
పెందుర్తిలో రోడ్‌షో, బహిరంగ సభ
నిరుపేదలపై దొంగ ప్రేమ చూపిస్తున్న ఈ సీఎం.. సెంటు భూమి ఇస్తానంటూ నాటకాలు ఆడుతున్నాడు. ఈ సెంటు భూమి శ్మశానానికి తప్ప దేనికైనా పనికొస్తుందా? టీడీపీ హయాంలో పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చాం.
- చంద్రబాబు
విశాఖపట్నం, మే 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ వధ చేసి, మళ్లీ గౌరవంగా అసెంబ్లీలో అడుగుపెడతానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. నవంబరు, డిసెంబరుల్లో ఎన్నికలు నిర్వహించాలని సీఎం జగన్ చూస్తున్నారని, రేపు ఎన్నికలు పెట్టినా తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి..’ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన విశాఖ నగరం పెందుర్తిలో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం జంక్షన్‌లోని ఎన్‌టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించిన సభలో ప్రజలనుద్దేశించి ప్రసగించారు. జగన్మోహన్‌రెడ్డి వద్ద ధన బలం ఉంటే, తమ వద్ద ప్రజా బలం ఉందన్నారు. డబ్బును అడ్డంగా పెట్టుకుని రెచ్చిపోవద్దని, గెలిచేది టీడీపీయేనని... గెలిపించేది ప్రజలేనని స్పష్టంచేశారు. రాజధాని ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్లిచ్చేందుకు ఐదు శాతం భూమిని రిజర్వు చేశానన్నారు. కానీ ఈ సైకో ముఖ్యమంత్రి ఇప్పుడు ఒకేచోట వేయి ఎకరాల్లో సెంటు భూమి చొప్పున ఇస్తానంటూ పేదలను మోసం చేస్తున్నాడని, వాళ్ల ఉసురు తగలక మానదని హెచ్చరించారు. సెంటు భూమి సమాధి కట్టుకోవడానికి తప్ప.. దేనికీ పనికిరాదన్నారు. ఇంకా ఏమన్నారంటే.. రాష్ట్రాన్ని సైకో ముఖ్యమంత్రి పాలిస్తున్నాడు. వైసీపీకే చెందిన ఎంపీ రఘురామకృష్ణంరాజును సీఐడీ అధికారులతో కొట్టించాడు. మొన్న రాజమండ్రిలో ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుటుంబాన్ని వేధించారు. బాబాయి వివేకానందరెడ్డిని హత్యచేసి నాపై నెట్టే యత్నం చేశారు. ఇప్పుడు ఆ కేసు నుంచి బయటపడేందుకు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు. సొం త బాబాయిని చంపి ఓట్లు తెచ్చుకున్న జగన్ సైకో కాదా? వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 5.30 గంటలకు ఎన్నికల ప్రణాళిక కోసం మీటింగ్ పెట్టిన జగన్.. తన బాబాయి గుండెపోటుతో చనిపోయినట్లు అజేయ కల్లం తదితరుల సమక్షంలో వెల్లడించాడు. గుండెపోటు అని ఆయనకు ఎలా తెలిసింది? విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో కోడి కత్తి కేసుతోనూ ఎన్నికల్లో లబ్ధి పొందారు. ఇప్పుడు నేను ఉంటున్న ఇంటిని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. నాకు జగన్మోహన్‌రెడ్డి మాదిరిగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇడుపులపాయ, కడప, పులివెందుల్లో ప్యాలె్‌సలు లేవు. అద్దె ఇంట్లో ఉంటున్నాను.. అద్దె కడుతున్నానని చెబుతున్నప్పటికీ క్విడ్ ప్రో కో జరిగిందంటున్నారు. రింగురోడ్డు పేరుతో కూల్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఆర్థిక, ఐటీ రాజధానిగా విశాఖ..
అమరావతిని రాష్ట్ర రాజధానిగా అంతా కలిసే నిర్ణయించాం. విశాఖను ఆర్థిక, ఐటీ రాజధానిగా, టూరిజం హబ్‌గా చేయాలని భావించాం. అయితే జగన్‌రెడ్డి మొత్తం నాశనం చేశాడు. అన్ని రాష్ట్రాలకూ రాజఽధానులు ఉన్నాయి. ఏపీ రాజఽధాని ఏదంటే ఇప్పటికీ చెప్పలేని పరిస్థితిని సృష్టించాడు. రాజధాని అమరావతేనని సైకో ముఖ్యమంత్రికి వినపడేలా నినదించాలి. విశాఖలో కడప, పులివెందుల రాజకీయం వద్దని ఇక్కడి ప్రజలు 2014లోనే జగన్‌రెడ్డి తల్లిని ఓడించి స్పష్టం చేశారు. విశాఖను అభివృద్ధి చేసే బాధ్యత నాదే. టీడీపీ అధికారంలో ఉండి ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయ్యేది. గోదావరి నీళ్లు వచ్చేవి. ఈ సైకో దానిని పట్టించుకోలేదు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు టీడీపీ శంకుస్థాపన చేసినప్పుడు.. తాను అధికారంలోకి వస్తే ఎయిర్‌పోర్టు భూములు తిరిగిచ్చేస్తానని చెప్పిన సైకో ఇప్పుడు మళ్లీ శంకుస్థాపన ఎందుకు చేశాడో చెప్పాలి.
వైసీపీకి వచ్చే సీట్లు గుండు సున్నా
మొన్న జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీని గెలిపించారు. 175 సీట్లు గెలుస్తామంటూ గొప్పలు చెబుతున్న జగన్మోహన్‌రెడ్డి.. ఈ సారి ఒక్క సీటూ గెలవడు. ఆ పార్టీకి వచ్చేది గుండు సున్నా మాత్రమే. కుప్పం గెలుస్తామంటున్న జగన్.. పులివెందులలో ఓడిపోకుండా చూసుకోవాలి. జగన్ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో బాదుడే బాదుడంటూ విపరీతమైన భారం మోపాడు. జే బ్రాండ్ పేరుతో నాసిరకం మధ్యం విక్రయిస్తూ పేదల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నాడు. పోలీసులు తటస్థంగా ఉంటే వైసీపీ పని అయిపోతుంది. రానున్న రోజుల్లో పోలీసులకు జీతాలు పెంచేది, గౌరవం తీసుకువచ్చేది నేనే. జగన్‌ను నమ్మితే పోలీసులకు జైలు తప్పదు. రానున్న ఎన్నికలు వైసీపీకి అంతిమయాత్ర కావాలి. రాష్ట్ర భవిష్యత్‌ను కాపాడుకోవడానికి ఎన్నికల వరకు ప్రతి ఇంటిపైనా టీడీపీ జెండా ఎగురేయాలి. అప్పులు చేసే పార్టీ వైసీపీ.. సంపద సృష్టించే పార్టీ టీడీపీ. రూ.పది లక్షల కోట్లు అప్పులు చేసిన జగన్ రూ.2 లక్షల కోట్లు దోచుకున్నాడు. గతంలో రూ.43 వేల కోట్లు దోచుకున్నాడు. చిత్తూరు జిల్లా పుంగనూరులో రూ.3 వేల కోట్లకు కక్కుర్తి పడి నాలుగు గ్రామాలను ఖాళీ చేయించి ప్రాజెక్టులు నిర్మించారు. స్థానిక ప్రజలు ఎన్‌జీటీకి వెళితే వంద కోట్లు కట్టాల్సిందిగా ఆదేశాలిచ్చింది. ఆ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించి తొలుత రూ.25 కోట్లు కట్టాలని చెప్పింది.
మాస్క్ అడిగితే చంపేశారు..
కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు దళిత వైద్యుడు సుధాకర్‌ను నిర్దాక్షిణ్యంగా ఈ సైకో సీఎం వేధింపులతో చంపేశాడు. నేను సమావేశాలు పెడుతుంటే జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఈ సీఎం మాత్రం పరదాల మాటున వెళ్తున్నాడు. విశాఖలో 52వేల టిడ్కో ఇళ్ల నిర్మాణం ప్రారంభించా. అన్ని వసతులతో 32 వేల మందికి ఇళ్లను ఇచ్చాం. మరో 22 వేల ఇళ్లు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఈ సైకో ఇవ్వలేదు. భీమిలి ప్రాంతంలో 117మంది మత్స్యకారులకు ఇళ్లు ఇచ్చేందుకు టీడీపీ ప్రభుత్వం కృషిచేస్తే, వారికి అందకుండా చేశాడు. టీడీపీ అధికారంలో విశాఖలో 60 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి రెగ్యులరైజ్ చేశాం.