హనుమాయమ్మ కుటుంబానికి అండ

ABN , First Publish Date - 2023-06-09T05:18:01+05:30 IST

వైసీపీ నేత కొండలరావు దాడిలో అత్యంత దారుణంగా హత్యకు గురైన అంగన్‌వాడీ కార్యకర్త సవలం హనుమాయమ్మ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని...

హనుమాయమ్మ కుటుంబానికి అండ

రూ.5 లక్షల సాయం అందజేసిన టీడీపీ

రావివారిపాలెం(టంగుటూరు), జూన్‌ 8: వైసీపీ నేత కొండలరావు దాడిలో అత్యంత దారుణంగా హత్యకు గురైన అంగన్‌వాడీ కార్యకర్త సవలం హనుమాయమ్మ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య భరోసా ఇచ్చారు. గురువారం ప్రకాశం జిల్లా టంగుటూరు పంచాయతీ రావివారిపాలెంలోని హనుమాయమ్మ ఇంటికి టీడీపీ నేతలు వెళ్లారు. ఆమె చిత్రపటానికి సత్య పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. చంద్రబాబు పంపించిన రూ.5 లక్షల నగదును హనుమాయమ్మ కుటుంబసభ్యులకు అందించారు. హత్య జరిగిన తీరు, కారణాలను ఆమె భర్త సుధాకర్‌, కుమార్తె మాధురి, కుమారుడు మారుతీరావులను అడిగి తెలుసుకున్నారు. తన కళ్ల ఎదుటే దారుణం జరిగిందని, అంగనవాడీ కేంద్రం నుంచి ఇంటికి వస్తున్న అమ్మను ఇంటి ముందే ట్రాక్టర్‌తో రెండు సార్లు తొక్కించి పాశవికంగా చంపాడని మాధురి వివరించారు. ముందు తమ ఇంటి ప్రహరీని పగులకొట్టాడని కోప్పడి ప్రశ్నించానని తెలిపారు. తీరా పడిపోయిన గోడ రాళ్ల మధ్య అమ్మ తీవ్రగాయాల పాలై ఉందని మాధురి విలపించారు. కొండలరావు పలుమార్లు తనపై దాడికి పాల్పడ్డాడని, అతని పైశాచిక స్వభావాన్ని సర్దుకుపోయామని సుధాకర్‌ తెలిపారు. నీ భర్తనో, నిన్నో, ఎవరోఒకర్ని లేపేస్తానని తన భార్యను కొడలరావు బెదిరించాడని పేర్కొన్నారు. రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన తనకు ఈ విషయం చెప్పి బావురుమన్నదని, జాగ్రత్తగా ఉండమని పదేపదే చెప్పి, చివరకు ఆమే వాడి కాటుకు బలైందని వాపోయారు. కాగా, కుటుంబానికి న్యాయం జరిగే వరకు పార్టీ అండగా ఉంటుందని, భయపడవద్దని ఆమె కుటుంబసభ్యులకు సత్య భరోసా ఇచ్చారు. బాధితులను ఆదుకునేందుకు చంద్రబాబు కట్టుబడి ఉన్నారని తెలిపారు.

Updated Date - 2023-06-09T05:18:01+05:30 IST