Odisha train accident: పెద్ద శబ్దం.. పెను కుదుపులు!

ABN , First Publish Date - 2023-06-04T04:12:33+05:30 IST

ఒడిశా ఘోర రైలుప్రమాదంలో పలువురు గాయాలతో బయటపడ్డారు. వీరిని స్వస్థలాలకు చేర్చేందుకు రైల్వేశాఖ ప్రత్యేక రైలు ఏర్పాటుచేసింది.

Odisha train accident: పెద్ద శబ్దం.. పెను కుదుపులు!

ఆ వెంటనే మిన్నంటిన హాహాకారాలు

ఒకర్నొకరు తొక్కుకుంటూ బయటపడే యత్నం

బయట చూస్తే.. మహా భయానక వాతావరణం

పట్టాల్నిండా, ఆ ప్రాంతమంతా రక్తసిక్తం

చేతులు తెగిన కొందరు పాకుతూ బయటకు..

ప్రయాణికుల కళ్లలో ఇంకా అవే భీతావహ దృశ్యాలు

ప్రత్యేక రైలులో స్వస్థలాలకు చేరిన ప్రయాణికులు

ఏపీ ప్రయాణికుల్లో కొందరితో మాట్లాడిన ‘ఆంధ్రజ్యోతి’

(ఆంధ్రజ్యోతి - న్యూస్‌ నెట్‌వర్క్‌)

ఒడిశా ఘోర రైలుప్రమాదంలో పలువురు గాయాలతో బయటపడ్డారు. వీరిని స్వస్థలాలకు చేర్చేందుకు రైల్వేశాఖ ప్రత్యేక రైలు ఏర్పాటుచేసింది. ఈ రైలు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. పది మంది వరకూ విశాఖపట్నంలో దిగారు. వారిని ఇళ్లకు పంపేందుకు, గాయాలు ఎక్కువగా ఉన్నవారిని ఆస్పత్రులకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లుచేశారు. స్పెషల్‌ రైలులో వచ్చిన వారితో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరును ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధులు తెలుసుకునే ప్రయత్నం చేశారు. మాట్లాడుతూ, మాట్లాడుతూ పలువురు బాధితులు భోరుమని విలపించారు. ఏం జరిగిందో, అంత ఘోరం ఎలా జరిగిందో ఇప్పటికీ అర్థం కాలేదంటూ పలువురు పేర్కొనగా, మరికొంతమంది ఈ ప్రమాదం నుంచి తేరుకోకపోవడం గమనార్హం. అలాగే.. రాజమహేంద్రవరం, ఏలూరు, నెల్లూరుల్లో మరికొందరు ప్రయాణికులు దిగారు.

‘‘నా చుట్టు భీతావహ వాతావరణం అలుముకుంది. పట్టాల్నిండా, అక్కడి నేలంతా నెత్తురు. చేతులు తెగిపోయిన కొందరు తమ బోగీల్లోంచి పాకుతూ బయటకు రావడం చూశాను. మృతశరీరాలు ఎక్కడంటే అక్కడ చెల్లాచెదురుగా పడిఉన్నాయి. నేను కోరమాండల్‌లో చివరి బోగీలో ఉన్నాను. పెద్ద శబ్దం వచ్చి... రైలు ఆగగానే.. ఏదో ప్రమాదం జరిగిందని అనుకున్నాను. నా లగేజీతో రైలు దిగిపోయాను. బయట అంతా చీకటి. మా పక్క పట్టాలపై మూడు బోగీలు తలకిందులుగా పడిపోయాయి. అవి యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రె్‌సకు చెందిన జనరల్‌ బోగీలని ఆ తర్వాత నాకు తెలిసింది’’

- అనుభవ్‌ దాస్‌, వైద్య విద్యార్థి, పశ్చిమ బెంగాల్‌

ఒడిశాకు మహాప్రస్థానం వాహనాలు

ఒడిశా రైలు ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు కాకినాడ జీజీహెచ్‌కు సంబంధించిన ఏడు మహాప్రస్థానం వాహనాలు శనివారం సాయంత్రం బయల్దేరి వెళ్లాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డీఎంఈ డాక్టర్‌ నరసింహం శనివారం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జీజీహెచ్‌ ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటరెడ్డి, ఆర్‌ఎంవో డాక్టర్‌ అనిత ఆ వాహనాలను సిద్ధం చేశారు.

కిటికీ అద్దంలోంచి బయటపడ్డాం : కె.లోకేశ్‌, విశాఖ

‘‘మాది విశాఖ జిల్లా మారికవలస. అమ్మవారి పండక్కి మా కుటుంబసభ్యులమంతా కోల్‌కతా వెళ్లాం. పండగ పూర్తికావడంతో కోరమాండల్‌లో తిరుగు ప్రయాణమయ్యాం. బీ5లో సీట్లు వచ్చాయి. ప్రయాణం సాఫీగా సాగుతున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చిం ది. బీ6 వరకూ బోగీలన్నీ తిరగబడిపోయాయి. అందులో మేంకూడా ఉన్నాం. ట్రైన్‌ కిందకు వెళ్లిపోయాం. ఆ సమయంలో ఎవరో వచ్చి కిటికీ అద్దం పగలగొట్టారు. ఆ అద్దంలో నుంచి బయటకు వచ్చాం. కాళ్లకు, చేతులకు దెబ్బలు తగిలాయి’’

అంతా నాపై పడిపోయారు: ఆర్‌.శంకర్‌, రణస్థలం

‘‘కోల్‌కతాలోని స్నేహితుడి ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కు వెళ్లాను. కోరమాండల్‌లో రణస్థలం బయలుదేరాను. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడం... ట్రైన్‌ సడన్‌గా ఆగిపోవడం ఒకేసారి జరిగాయి. అందరం కింద పడిపోయాం. నా పైన ఎంతో మంది పడిపోయారు. నా కాలు నలిగిపోయింది. బోగీలోని రాడ్‌కు తల తగలడంతో దెబ్బ తగిలింది. మెల్లగా బయటకు రాగలిగాను. అక్కడ చూస్తే చీకటి వాతావరణం, చుట్టూ కేకలు, ఏడుపులు, ఆర్తనాదాలు...వాతావరణం భీతావహంగా కనిపించింది’’

తలుచుకుంటే భయమేస్తోంది

‘‘అసోంలోని గ్యాంగ్‌టక్‌ చూసేందుకు వారం కిందట ముగ్గురు స్నేహితులం వెళ్లాం. తిరుగు ప్రయాణంలో కోల్‌కతాలో కోరమాండల్‌ (బీ4 కోచ్‌) ఎక్కాం. 7గంటల సమయంలో పెద్ద శబ్దం వచ్చింది. నేను, నా మిత్రులం చెల్లాచెదురయ్యాం. తిరిగి ఎలా బయటపడ్డామనేది తలుచుకుంటేనే భయం వేస్తోంది. విశాఖ పోర్టులో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో పనిచేసిన అనుభవంతో.. నేను కొన్ని కిటికీలు స్వయంగా బద్ధలుగొట్టాను. దాంతో చాలామంది బయటకొచ్చాం’’ - పొలమరశెట్టి రమేశ్‌, మురళీనగర్‌, విశాఖపట్నం

లైట్లు ఆగి.. వెలిగాయి

‘‘సమ్మర్‌కు మా కుటుంబసభ్యులం డార్జిలింగ్‌ వెళ్లాం. తిరుగు ప్రయాణంలో కోల్‌కతాలో కోరమాండల్‌ ఎక్కాం. 7 గంటలకు ఐదు పదినిమిషాలు ముందు ట్రైన్‌లో పలుమార్లు లైట్లు ఆరి, వెలిగాయి. ఇలా నాలుగు, ఐదుసార్లు జరిగింది. తర్వాత పెద్ద శబ్దం వచ్చింది. బోగీల్లో కరెంట్‌ ఆగిపోవడంతో చీకటి అలుముకుంది.

- బి.రవికుమార్‌, ప్రముఖ ఇంజనీరింగ్‌ కళాశాల ఫ్యాకల్టీ, విశాఖ

క్షణాల్లో బోగీ ఒరిగిపోయింది: పృథ్వీకుమార్‌, మద్దిలపాలెం, విశాఖ

‘‘మా బాబాయ్‌ కుటుంబంతో కలిసి వారణాసి వెళ్లాం. 2న మధ్యాహ్నం 3.20 గంటలకు కోరమాండల్‌ రైలు(బీ2 బోగీలో) ఎక్కాం. రాత్రి 7 గంటల సమయంలో బాలాసోర్‌ ప్రాంతానికి చేరుకొనేసరికి ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. క్షణాల్లో బోగీ ఒరిగిపోయింది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మా కుటుంబ సభ్యులంతా చెల్లాచెదురుగా పడిపోయాం. కొంతమంది రైలు బోగీ కిటీకీలు బద్దలుగొడుతున్నారు. ఎలాగో మేమంతా బయటపడ్డాం’’

కాలు రెండు బెర్త్‌ల మధ్య ఇరుక్కుపోయింది

‘‘పది రోజుల కిందట ఖరగ్‌పూర్‌లోని మా అక్కవాళ్ల ఇంటికి వెళ్లాను. శుక్రవారం కోరమాండల్‌ ఎక్స్‌ప్రె్‌సలో తిరుగు ప్రయాణమయ్యాం. రాత్రి ఏడు గంటల సమయంలో మేమిద్దరం బెర్త్‌పై నిద్రపోయాం. ఒక్కసారిగా భరించలేనంత శబ్దం రావడంతో ఏమైందోనని కళ్లు తెరిచాం. అప్పటికే జనం ఒకరిపై ఒకరు పడిపోతున్నారు. పాప కనిపించలేదు. లేచి వెళ్లి వెతకాలనుకున్నాను. కానీ కాలు కదలడం లేదు. నా కుడికాలు రెండు బెర్త్‌ల మధ్య ఇరుక్కుని విరిగిపోయింది. కొంతసేపటికి పాప నా వద్దకు వచ్చింది. ప్రయాణికులు, పోలీసులు నన్ను బయటకు లాగారు’’

- వి.జానకి, పెదగంట్యాడ హెబ్‌బీ కాలనీ, విశాఖపట్నం

ఆ దృశ్యాలు చూడలేకపోయా: కృష్ణ కాంత బిశ్వాస్‌, పశ్చిమబెంగాల్‌

‘‘నెల్లూరులోని ఓ కంపెనీలో వెల్డింగ్‌ విభాగంలో పనిచేస్తున్నాను. సొంతూరు గురుద్వార్‌ వెళ్లేందుకు యశ్వంత్‌పూర్‌ రైలు ఎక్కాను. ప్రయాణం సాగుతుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి భారీ కుదుపుతో రైలు నిలిచిపోయింది. ముందువైపు ఉన్న బోగీలన్నీ నుజ్జునుజ్జయ్యాయి. వాటిలో చిక్కుకున్న ప్రయాణికులు హాహాకారాలు చేస్తున్నారు. సెల్‌ఫోన్‌ లైటు ఆ వెలుతురులో ఆ దృశ్యాలు చుడలేకపోయాను. బిక్కుబిక్కుమంటూ రాత్రంతా అక్కడే ఉండిపోయాను’’

·

Updated Date - 2023-06-04T09:57:48+05:30 IST