సర్కారుపై ‘సీపీఎస్’ యుద్ధం
ABN , First Publish Date - 2023-06-19T02:33:23+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలన్నీ ఒక్కటయ్యాయి.
చేతులు కలిపిన సీపీఎస్ ఉద్యోగుల సంఘాలు
ఏపీసీపీఎస్‌ఈఏలో ఏపీసీపీఎస్‌యూఎస్ విలీనం
సెక్రటేరియట్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం మద్దతు
ఫ్యాప్టోతో కలసి కొనసాగింపుపై నిర్ణయం
విజయవాడ, జూన 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలన్నీ ఒక్కటయ్యాయి. ప్రభుత్వంతో చావో, రేవో తేల్చుకోవటానికి విలీనం తప్పితే మరో మార్గం లేదని నిర్ణయించాయి. ప్రధాన ఉద్యోగ జేఏసీలపై ఆధారపడటం కంటే స్వశక్తిని నమ్ముకోవడమే మేలని భావించి, ఇప్పటివరకూ చీలికలు, పీలికలుగా ఉన్న సీపీఎస్ ఉద్యోగ సంఘాలన్నీ ఆదివారం విజయవాడలో ఏకమయ్యాయి. ప్రధాన భూమిక పోషిస్తున్న ఏపీసీపీఎ్‌సఈఏలోకి గుర్తింపు ఉన్న ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం (ఏపీసీపీఎ్‌సయూఎస్) విలీనమైంది. దీనికి నేతృత్వం వహిస్తున్న రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దాసు, రవికుమార్ తమ సంఘాన్ని, నాయకత్వాన్ని ఏపీసీపీఎ్‌సఈఏలో విలీనం చేశారు. ప్రస్తుతానికి ఏపీసీపీఎ్‌సఈఏ రాష్ట్ర కార్యవర్గమే కొనసాగుతుంది. ఏపీసీపీఎ్‌సయూఎస్ నుంచి వచ్చినవారికి ఎలాంటి పదవులను ఇవ్వాలనేది చర్చించి వారిని కూడా రాష్ట్ర కార్యవర్గంలో భాగస్వాములను చేస్తారు. ఈ కీలక సమావేశానికి హాజరైన సెక్రటేరియట్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం బయటనుంచి మద్దతు పలికేందుకు అంగీకరించింది. ఏపీజేఏసీలో అనుబంధంగా ఉన్న ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) బయటకు రాగానే.. ఉపాధ్యాయ సంఘాల జేఏసీని ఏర్పాటుచేసే అవకాశం ఉంది. దీనితో ఏపీసీపీఎ్‌సఈఏ కలసి ఐక్య ఉద్యమాల దిశగా అడుగులు వేయాలని భావిస్తున్నాయి. సంఘాల విలీనం నేపథ్యంలో, తాత్కాలిక ఉద్యమ షెడ్యూల్‌ను నాయకత్వం ప్రకటించింది. జూన్ 19, 26 తేదీల్లో జిల్లా కలెక్టరేట్లలో నిర్వహించే స్పందన కార్యక్రమాల్లో ఓపీఎస్ అమలు, సీపీఎస్, జీపీఎస్ రద్దు చేయాలని కోరుతూ కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు. జూన్ 20- 25 తేదీల్లో ఎమ్మెల్యేలను కలసి ఓపీఎస్ అమలు చేస్తేనే ఓటు వేస్తామని అభ్యర్థన పత్రాలు ఇస్తారు. 25న ఉపాధ్యాయ సంఘాలతో విజయవాడలో రౌండ్‌టేబుల్ నిర్వహిస్తారు. జూలై 8న జిల్లా కలెక్టరేట్ల ఎదుట మహాధర్నా కార్యక్రమాలు చేపడతారు. కాగా, సీపీఎస్‌ను రద్దుచేసి, ఓపీఎ్‌సను పునరుద్ధరించకపోతే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం గద్దె దిగాల్సి వస్తుందని ఏపీసీపీఎ్‌సఈఏ అగ్రనాయకత్వం హెచ్చరించింది. జీపీఎస్ భజన చేస్తున్న జేఏసీ నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణల వెంట 99శాతం మంది ఉద్యోగులు లేరని, భవిష్యత్తులో ఏ సీపీఎస్ ఉద్యోగి కూడా వారికి సభ్యత్వం కట్టబోడని స్పష్టంచేసింది.