Raghavulu: పోలవరం పూర్తవుతుందో లేదో డౌటే

ABN , First Publish Date - 2023-07-04T14:39:26+05:30 IST

పోలవరం నిర్మాణం విషయంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారని.. కానీ అతీగతి లేదని సీపీఎం కేంద్ర‌ పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు వ్యాఖ్యలు చేశారు.

Raghavulu: పోలవరం పూర్తవుతుందో లేదో డౌటే

విజయవాడ: పోలవరం నిర్మాణం విషయంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు మారారని.. కానీ అతీగతి లేదని సీపీఎం కేంద్ర‌ పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు (CPI BV Raghavulu) వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... పోలవరం 2025 డెడ్ లైన్ అంటున్నారని.. అది పూర్తవుతుందో లేదో డౌటే అని అన్నారు. పోలవరం ఆలస్యానికి కారణం ఎవరని ప్రశ్నించారు. ఎలక్షన్‌కు దండుకోవడమే పోలవరం అని అన్నారు. కేంద్రాన్ని అడగకుండా గత ఐదేళ్లు టీడీపీ మోసం చేసిందని విమర్శించారు. త్యాగం చేసేది పోలవరం నిర్వాసితులు.. అనుభవించేది మనమన్నారు. పోలవరం నిర్వాసితులు త్యాగం చేశారు కాబట్టి ప్రజలంతా వారికి అండగా నిలబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని అన్నారు.

పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికై రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. గతంలో పోలవరంలో వరద వస్తే చెట్ల కింద తలదాచుకొనే పరిస్ధితి ఉండేదని.. తిండిలేక అల్లాడిపోయారని.. అయినా ప్రభుత్వం వారిని పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. పోలవరం నిర్వాసితులు వరద వస్తే మునిగిపోతుంటే సమాజానికి మానవత్వం లేదా.. మనకోసం భూములిచ్చి త్యాగం చేస్తుంటే మనం స్పందించాల్సిన బాధ్యత లేదా అని అడిగారు. రాబోయే రోజుల్లో వరదలొస్తే పోలవరం ముంపు గ్రామాలు మునిగిపోతాయన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ముంపు బాధితులకు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. పోలవరంలో వరద వస్తే ఈసారి కొండలెక్కి తలదాచుకోరని.. తాడేపల్లి ప్యాలెస్ ఎక్కి కూర్చుంటారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలకు ఏం చేయాలో చర్చించాలన్నారు. కేంద్రం పోలవరంకు నిధులివ్వడం లేదని.. రూ.56 వేల కోట్లు పోలవరంకు ఖర్చు అవుతుంటే కేవలం రూ.14 వేల కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు.

ఇప్పుడు మరో రూ.10 వేల కోట్లు ఎన్నికల కోసం ఇస్తామంటున్నారని తెలిపారు. ప్రభుత్వానికి ఇసుక, ఇటుక, స్టీల్‌పై ఉన్న శ్రద్ధ పోలవరం ముందు బాధితుల పట్ల లేదన్నారు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని.. పోలవరం ముంపు బాధితులు కనబడడం లేదా అంటూ ప్రశ్నించారు. గిరిజనులు అన్యాయం కావడానికి మొదటి ముద్దాయి కేంద్ర ప్రభుత్వమే అని అన్నారు. కేంద్రం ఇవ్వకపోతే పోరాడాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే అని..‌ బ్రతిమిలాడుకోవడం దేనికి అని నిలదీశారు. తెలుగు వాడి హక్కుల కోసం పోరాడిన చరిత్ర మనది అని.. ఇప్పుడు పిరికివాళ్లలా మారారని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మధ్య మిలాఖతు ఏంటని అడిగారు. సీఎం జగన్ పదే పదే పేదలు, ధనికుల మధ్య పోరాటం జరుగుతుందని అంటున్నారన్నారు. సీఎం జగన్ పోలవరం ముంపు బాధితుల పక్షాన ఉన్నారా లేక కాంట్రాక్టర్ల పక్షాన ఉన్నారో సమాధానం చెప్పాలన్నారు. మరో 15 రోజుల్లో ప్రభుత్వం పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచే ఉద్యమాలు చేపడతామని బీవీ రాఘవులు హెచ్చరించారు.

Updated Date - 2023-07-04T14:39:26+05:30 IST