Sheikh Shabji: ఎమ్మెల్సీ షేక్‌ షాబ్జీపై కేసు

ABN , First Publish Date - 2023-04-21T20:40:05+05:30 IST

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ షాబ్జీ (MLC Sheikh Shabji)పై తిరుమల పోలీస్టేషన్‌లో కేసు నమోదయ్యింది. తనతో పాటు తీసుకువచ్చిన ఆరుగురు భక్తుల ఆధార్‌..

Sheikh Shabji: ఎమ్మెల్సీ షేక్‌ షాబ్జీపై కేసు

తిరుమల: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ షాబ్జీ (MLC Sheikh Shabji)పై తిరుమల పోలీస్టేషన్‌లో కేసు నమోదయ్యింది. తనతో పాటు తీసుకువచ్చిన ఆరుగురు భక్తుల ఆధార్‌ చిరునామాలు మార్చి, నగదు తీసుకున్నారనే విజిలెన్స్‌ ఫిర్యాదుతో టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్సీ షేక్‌ షాబ్జీ 14మందికి ప్రొటోకాల్‌ దర్శనం కావాలని గురువారం తిరుమలలోని టీటీడీ జేఈవో కార్యాలయంలో లేఖ అందజేశారు. ఎమ్మెల్సీతో పాటు మరో తొమ్మిదిమందికి కలిపి మొత్తం 10 ప్రొటోకాల్‌ వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లను టీటీడీ (TTD) మంజూరు చేసింది. అయితే షేక్‌ షాబ్జీ ఆరుగురు భక్తులతో మాత్రమే శుక్రవారం దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో అక్కడే విధుల్లో ఉన్న విజిలెన్స్‌ అధికారులు ఎమ్మెల్సీతో పాటు వచ్చిన ఆరుగురు భక్తుల ఒరిజనల్‌ ఆధార్‌ కార్డులను తీసుకుని తనిఖీ చేశారు. జేఈవో కార్యాలయంలో దర్శన టికెట్లు కావాలని జతపరిచిన ఆధార్‌లోని చిరునామా హైదరాబాద్‌ కాగా, భక్తులు (Devotees) అందజేసిన ఆధార్‌లో మాత్రం బెంగళూరు (Bangalore) ఉండటాన్ని విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. వెంటనే ఎమ్మెల్సీ బృందాన్ని అదుపులోకి తీసుకుని టూటౌన్‌ పోలీసులకు అప్పగించారు. చిరునామా మార్చి ఎమ్మెల్సీ షేక్‌ షాబ్జీ అక్రమానికి పాల్పడ్డారనే ఫిర్యాదు ఆధారంగా... ఎమ్మెల్సీ పీఏ వేణుగోపాల్‌ను ఏ1గా, డేగరాజు అనే వ్యక్తిని ఏ2గా, ఎమ్మెల్సీ షేక్‌ షాబ్జీని ఏ3గా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ఎమ్మెల్సీ డ్రైవర్‌ ఖాతాలో రూ.1.05 లక్షలు

2021లో ఎమ్మెల్సీగా ఎన్నికైన షేక్‌ షాబ్జీ శ్రీవారి దర్శనం కోసం పలువురు భక్తులకు సిఫార్సు లేఖలు ఇవ్వడంతో పాటు స్వయంగా వస్తున్నారని టీటీడీ విజిలెన్స్‌ వింగ్‌ వీజీవో గిరిధర్‌ తెలిపారు. తాను స్వయంగా వస్తున్నానని చెప్పి ప్రొటోకాల్‌ వీఐపీ దర్శనాలు కావాలని జేఈవో కార్యాలయంలో నమోదు చేసుకున్నారన్నారు. కానీ ఎమ్మెల్సీతో పాటు ఆరుగురు మాత్రమే దర్శనానికి వచ్చారని తెలిపారు. ఆధార్‌ కార్డులను పరిశీలిస్తే చిరునామాలు మార్చినట్టు గుర్తించామని పేర్కొన్నారు. జేఈవో కార్యాలయంలో ఇచ్చిన ఆధార్‌ జిరాక్స్‌ల్లో మాత్రం హైదరాబాద్‌ చిరునామా ఉందన్నారు. దీంతో విచారణ చేపట్టామని తెలిపారు. ఎమ్మెల్సీ డ్రైవర్‌ రాజు అనే వ్యక్తికి రూ.1.05 లక్షలు వచ్చినట్టు గుర్తించామన్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఎన్ని సిఫార్సులు ఇచ్చారు, అక్రమాలకు పాల్పడ్డారా లేదని అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.

Updated Date - 2023-04-21T20:40:05+05:30 IST