పులివెందులలో సీబీఐ.. ఎంపీ అవినాశ్‌రెడ్డి ఇంటి పరిసరాల పరిశీలన
ABN , First Publish Date - 2023-01-23T20:10:00+05:30 IST
సీబీఐ (CBI) బృందం సోమవారం పులివెందులకు వచ్చింది. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో సీబీఐ బృందం కడప నుంచి పులివెందుల (Pulivendula)కు వచ్చింది.
కడప: సీబీఐ (CBI) బృందం సోమవారం పులివెందులకు వచ్చింది. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో సీబీఐ బృందం కడప నుంచి పులివెందుల (Pulivendula)కు వచ్చింది. ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ఇంటి పరిసర ప్రాంతాలను పరిశీలించింది. అలాగే ఓఎస్డీ కార్యాలయ పరిసర ప్రాంతాలను కూడా పరిశీలించింది. అవినాశ్‌రెడ్డి ఇంటి వద్ద ఉన్న వారినుంచి ఎంపీ తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి (YS Bhaskar Reddy) ఇంట్లో ఉన్నారా అని వాకబు చేశారు. ఆయన లేరని సమాధానం రావడంతో అక్కడి నుంచి వెళ్లారు. అనంతరం ఓఎస్డీ కార్యాలయం, సీఎం క్యాంప్ ఆఫీస్ చేరుకొని అక్కడ కూడా వైఎస్ భాస్కర్‌రెడ్డి ఉన్నారా అని ప్రశ్నించారు. అక్కడ కూడా ఆయన లేకపోవడంతో కడప (Kadapa)కు వెళ్లినట్లు సమాచారం.
కొన్ని నెలలుగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసు విచారణలో స్తబ్దత నెలకొంది. ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని, ఈ హత్య కేసులో మొదటి నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీచేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ విషయంలో ఇంకా ఏ విషయం కొలిక్కి రాలేదు. ఎర్రగంగిరెడ్డి బెయిల్ వ్యవహారం తేలేవరకు సీబీఐ ఎలాంటి దర్యాప్తు చేపట్టదేమోనని పులివెందులో కొన్నిరోజులుగా చర్చించుకుంటున్నారు. అనూహ్యంగా సోమవారం సీబీఐ బృందం ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ఇంటి పరిసర ప్రాంతాలను, సీఎం క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలించారు. దీంతో మరోసారి సీబీఐ తన కార్యక్రమాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది.