Chandrababu : వలంటీర్ వ్యవస్థపై పవన్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
ABN , First Publish Date - 2023-07-12T13:35:35+05:30 IST
వలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు నేడు స్పందించారు. చంద్రబాబు నేడు కాసేపు మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
అమరావతి : వలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు నేడు స్పందించారు. చంద్రబాబు నేడు కాసేపు మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. దీనిలో భాగంగా మీడియా ఆయనను వలంటీర్ వ్యవస్థపై పవన్ చేసిన కామెంట్లపై స్పందన కోరగా.. వ్యక్తిగత సమాచారం సేకరించడం ద్రోహమన్నారు. వలంటీర్లు పౌరసేవకు పరిమితం కాకుండా రాజకీయ జోక్యం చేసుకుంటే కుదరదన్నారు. వ్యక్తిగత సమాచార సేకరణ వల్ల చాలా ప్రమాదం పొంచి ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజా సేవ వరకే వలంటీర్ల సేవలను పరిశీలిస్తామన్నారు.
జగన్మోహన్ రెడ్డికి ఏసుప్రభువు ఏమైనా చెప్పాడా ?
ఏపీ సీఎం జగన్ గురించి చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘ఇంత అవినీతి చేయమని జగన్మోహన్ రెడ్డికి ఏసుప్రభువు ఏమైనా చెప్పాడా ? లక్షల కోట్ల ప్రజా సంపద నాశనం చేసి, లక్షల కోట్లు అప్పు చేయమని ఖురాన్ చెప్పిందా? అధికారంలో ఉండగా నేనేం చేశానో ప్రజలు చూశారు. గత నాలుగేళ్లుగా జగన్ ఏం చేస్తున్నాడో కూడా బేరీజు వేసుకున్నారు.. పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడో వింటున్నారు. రూ.500 నోట్లు కూడా రద్దు చేసేస్తే ఎన్నికల్లో డబ్బులు పంచే శని వదిలిపోతుందా? రాజకీయాల ద్వారా సేవ చేయాలంటే డబ్బులు పంచాలా ? ఏపీ-మహారాష్ట్ర లను కలిపేస్తే మూడు రాజధానులు- ముగ్గురు సీఎంల సమస్య తీరుతుందనే జోకులు హల్చల్ చేస్తున్నాయి.
ఋషికొండపై జగన్మోహన్ రెడ్డి కట్టుకునే విలాసవంతమైన భవనం కోసం దేశ విదేశాల నుంచి ఫర్నిచర్ తెప్పిస్తున్నారట. పవర్ రిఫార్మ్స్ వల్ల 2004లో నా పవర్ పోయినా రాష్ట్రం బాగుపడింది. ఇతర రాష్ట్రాలకు తక్కువ ధరకు విద్యుత్ పంపిణీ చేసే సంస్కరణలు తీసుకొస్తాం. ఏపీలో అమలయ్యే విద్యుత్ విధానం దేశానికే ఆదర్శంగా నిలిచే చర్యలు చేపడతాం. ఇప్పుడు హైదరాబాద్ కి వెళ్తే నాకు ఓట్లు పడకపోవచ్చు..., ఈ తరం వారికి చేసిన కృషి తెలియకపోవచ్చు కానీ నేను అభివృద్ధి చేశాననే సంతృప్తి మాత్రం నాకుంది. భవిష్యత్తు కు గ్యారెంటీ కింద నేను కూడా త్వరలోనే పల్లె నిద్ర కార్యక్రమాలు చేపడతా’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.