ఎక్కడికక్కడ అంగన్వాడీల అడ్డగింత

ABN , First Publish Date - 2023-09-25T02:24:09+05:30 IST

హక్కుల సాధనకోసం విజయవాడలో జరిగే ఆందోళనలో పాల్గొనేందుకు ఆదివారం బయలుదేరిన అంగన్వాడీలను కుప్పంలో పోలీసులు అడ్డుకున్నారు.

ఎక్కడికక్కడ అంగన్వాడీల అడ్డగింత
కుప్పం రైల్వే స్టేషన్‌లో అంగన్వాడీలను అడ్డుకుంటున్న పోలీసులు

‘ఛలో విజయవాడ’ను అడ్డుకున్న పోలీసులు

పలుచోట్ల నిర్బంధాలు

కుప్పం, సెప్టెంబరు 24: హక్కుల సాధనకోసం విజయవాడలో జరిగే ఆందోళనలో పాల్గొనేందుకు ఆదివారం బయలుదేరిన అంగన్వాడీలను కుప్పంలో పోలీసులు అడ్డుకున్నారు. స్థానిక రైల్వే స్టేషన్‌కు చేరుకున్న వీరిని అడ్డుకుని ఆటోలలో పోలీసు స్టేషన్‌కు తరలించారు. బస్సుల్లో బయలుదేరిన వారినీ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అంగన్వాడీలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తమకు ప్రభుత్వం వేతనాలు చెల్లించి మూడు నెలలకుపైగా అవుతోందని, కనీసమైన హక్కులను కల్పించకుండా ఎక్కడికక్కడ నిర్బంధాలకు గురి చేస్తోందని అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు మండిపడ్డారు. శాంతియుత నిరసన తెలపడానికి వెళ్తున్న తమను ఇలా అడ్డుకుని ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం దారుణమని ధ్వజమెత్తారు. ఎవరు ఎంతగా అణచడానికి ప్రయత్నించినా తమ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. శాంతిపురం మండలం నుంచి విజయవాడకు బయలుదేరిన వారిని పోలీసులు అడ్డుకుని రాళ్లబూదుగూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్బంధించడంతో వారు ఇబ్బంది పడ్డారు. ఇక, రామకుప్పం మండల పరిధి నుంచి సుమారు 50 మంది ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసుకుని విజయవాడకు బయలుదేరగా వి.కోట వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వీరిని టీటీడీ కల్యాణ మండపానికి తరలించి మహిళా పోలీసులు, గ్రామ పోలీసులను కాపలాగా పెట్టారు. తెలంగాణ కన్నా రూ.వెయ్యి అదనంగా వేతనం చెల్లిస్తామని ఎన్నికలకు ముందు మాటిచ్చిన జగన్‌.. ఆ హామీని నిలబెట్టుకోవాలన్నారు. నగరిలో పలువురిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. విజయవాడ వెళ్లరాదంటూ వెదురుకుప్పం, కార్వేటినగరం మండలాల్లోని పలువురు అంగన్వాడీ కార్యకర్తలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

Updated Date - 2023-09-25T02:24:09+05:30 IST