ఏపీ హేట్స్ జగన్
ABN , First Publish Date - 2023-11-11T02:31:50+05:30 IST
రాష్ట్రంలోని దుర్మార్గ పాలనను చూసి ప్రజలు ‘ఏపీ హేట్స్ జగన్’ అని అంటున్నారని మాజీ మంత్రి అమరనాథరెడ్డి వ్యాఖ్యానించారు.
గంగవరం, నవంబరు 10: రాష్ట్రంలోని దుర్మార్గ పాలనను చూసి ప్రజలు ‘ఏపీ హేట్స్ జగన్’ అని అంటున్నారని మాజీ మంత్రి అమరనాథరెడ్డి వ్యాఖ్యానించారు. పలమనేరులోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. జగన్ 52 నెలల పాలనలో ధరలు, పన్నులు, చార్జీలు, అప్పుల బాదుడుతో ఒక్కో కుటుంబంపై రూ.8,25,549 అదనపు భారం పడిందన్నారు. రూ.57 కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపారన్నారు. దశలవారీ మద్యనిషేధం అంటూనే నాసిరకం మద్యం అమ్మకాలతో మందుబాబుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఉచిత ఇసుక విధానానికి పాతర వేసి భవన రంగ నిర్మాణ కూలీల బతుకును రోడ్డున పడేశారన్నారు. దాదాపు 120 పథకాలను ఈ ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ ఆశచూపి 43 నుంచి 23 శాతానికి కోత వేసి దగా చేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పెద్దల దౌర్జన్యాలను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపడం.. సొంత చిన్నాన్నను నరికి చంపిన వారిని కాపాడుతున్నారంటూ సీఎంను ప్రశ్నించారు. ఇలాంటి పాలనతో విసిన ప్రజలు.. ఈ ప్రభుత్వం మనకెందుకని అంటున్నారన్నారు.