Share News

చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని ప్రభుత్వమే కొనసాగించాలి

ABN , Publish Date - Dec 18 , 2023 | 11:42 PM

చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని ప్రభుత్వమే కొనసాగించాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అఖిలపక్ష నేతలు, ప్రజా సంఘాలు డిమాండు చేశాయి.

చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని ప్రభుత్వమే కొనసాగించాలి
రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో అఖిలపక్ష నేతల డిమాండ్‌

చిత్తూరు రూరల్‌, డిసెంబరు 18: చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని ప్రభుత్వమే కొనసాగించాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అఖిలపక్ష నేతలు, ప్రజా సంఘాలు డిమాండు చేశాయి. చిత్తూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు నేతలు మాట్లాడారు. నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి గత ప్రభుత్వం అపోలో సంస్థకు చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని 33 సంవత్సరాల లీజుకు ఇచ్చిందన్నారు. ఇప్పుడు ఇక్కడ సరైన వైద్యం అందడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. రోగులను వేరే ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తూ కాలం గడుపుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఆస్పత్రిలో ఉన్న ప్రభుత్వ వైద్యులు, సిబ్బందిని తొలగించి పూర్తిగా అపోలో వారికే అప్పజెప్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఇలా జరిగితే వైద్యాన్ని డబ్బులు పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడే ప్రమాదం లేకపోలేదన్నారు. జిల్లా కేంద్రంలో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి లేకుంటే ప్రభుత్వానికే అవమానమన్నారు. జిల్లా ఆస్పత్రిని ప్రభుత్వమే నడిపించి పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు, జనసేన నాయకుడు దయారాం, సీపీఎం, బీఎస్పీ, లోక్‌సత్తా పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వాస్పత్రిలో ఉద్యోగులను తగ్గించకండి

చిత్తూరు కలెక్టరేట్‌: చిత్తూరు ప్రభుత్వ వైద్యశాలలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించి పరోక్షంగా అపోలో సంస్థకు అప్పగించవద్దంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు వీరు సోమవారం సాయంత్రం జేసీ శ్రీనివాసులును కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో చేసుకున్న ఎంవోయూ ప్రకారం ప్రభుత్వ.. అపోలో వైద్యులు, సిబ్బంది.. 50-50 శాతంగా వినియోగించుకోవాల్సి ఉందన్నారు. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను 50 శాతం నుంచి తగ్గిస్తూ పూర్తిగా అపోలోకు అప్పగించే చర్యలను తాము ఖండిస్తున్నామన్నారు. టీడీపీ నేతలు సప్తగిరి ప్రసాద్‌, కోదండయాదవ్‌, మోహన్‌ రాజ్‌, మేషాక్‌, శశికర్‌ బాబు, కుమార్‌ యాదవ్‌, ధరణీప్రకాష్‌, కందస్వామి, బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 11:42 PM