ట్యాంకర్ ఢీకొని కూలిన విద్యుత్ టవర్
ABN , First Publish Date - 2023-05-24T00:59:48+05:30 IST
తిరుపతి-శ్రీకాళహస్తి మార్గంలో ఓ పామాయిల్ ట్యాంకర్ అదుపు తప్పి 220 కేవీ విద్యుత్ టవర్‌ను ఢీకొంది.ట్యాంకర్ బోల్తా పడినప్పటికీ పామాయిల్ లీక్ కాకపోవడంతో విద్యుత్ టవర్‌కు ప్రమాదం సంభవించలేదు.
ఇసుకతాగేలి వద్ద తప్పిన పెనుప్రమాదం
విద్యుత్ శాఖకు రూ.15లక్షల నష్టం
ఏర్పేడు, మే 23: తిరుపతి-శ్రీకాళహస్తి మార్గంలో ఓ పామాయిల్ ట్యాంకర్ అదుపు తప్పి 220 కేవీ విద్యుత్ టవర్‌ను ఢీకొంది.ట్యాంకర్ బోల్తా పడినప్పటికీ పామాయిల్ లీక్ కాకపోవడంతో విద్యుత్ టవర్‌కు ప్రమాదం సంభవించలేదు.పామాయిల్ లీక్ అయుంటే మంటలు వ్యాపించి పెద్దనష్టం సంభవించి ఉండేది.ప్రమాద సమయంలో ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఏర్పేడు సీఐ శ్రీహరి కథనం మేరకు... నెల్లూరు నుంచి బెంగళూరుకు వెళుతున్న పామాయిల్ ట్యాంకరు ఏర్పేడు మండలం ఇసుకతాగేలి బస్టాప్ వద్ద ఎదురుగా వస్తున్న మినీవ్యాన్‌ను తప్పించబోయి సమీపంలోని పిట్టగోడ కల్వర్టుపైకి దూసుకెళ్లింది. దీంతో వాహనం అదుపు తప్పి సమీపంలోని 220కేవీ టవర్‌ను ఢీకొని బోల్తా పడింది. టవర్‌రోడ్డుపై కూలడంతో నిర్మాణంలో ఉన్న హైవేపైకి ట్రాఫిక్‌ను మళ్లించారు.ఈ ప్రమాదంలో కర్నూలు జిల్లా వెలుగోడుకు చెందిన డ్రైవర్ షేక్ రఫీకి స్వల్పగాయాలవడంతో తిరుపతి రుయాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద కారణంగా 33కేవీ ఏర్పేడు ఫీడర్ సైతం దెబ్బతింది. దీంతో శ్రీకాళహస్తి నుంచి 132 కేవీ సప్లై తీసుకుని ఏర్పేడుకు విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించారు. దెబ్బతిన్న 220కేవీ టవర్, 33 కేవీ లైన్లను పరిశీలించిన ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు కె.గురవయ్య, కృష్ణారెడ్డి, వాసురెడ్డి,వాసుదేవయ్య పునరుద్ధరణ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ ప్రమాదంతో మొత్తం రూ.15లక్షల నష్టం వాటిల్లింది. రేణిగుంట-రాచగున్నేరి నడుమ విద్యుత్ సరఫరా చేసే 220 కేవీ టవర్ పనులు చేపట్టడానికి సుమారు ఐదు రోజులు పట్టవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. ఏర్పేడు ఫీడర్ పనులు మాత్రం ఒకట్రెండు రోజుల్లో పూర్తి కానున్నాయి.
విద్యుత్ సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం
రేణిగుంట, మే 23 : ఇసుకతాగేలి బస్టాప్ సమీపంలో మంగళవారం ఉదయం విద్యుత్ టవర్‌ను లారీ ఢీకొన్నప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ సరఫరా చేశామని ట్రాన్స్‌కో అధికారులు వెల్లడించారు.రేణిగుంట 220 కేవీ సబ్‌స్టేషన్‌కు నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల నుంచి ప్రత్యేక టవర్ల ద్వారా విద్యుత్ సరఫరా అవుతుందని అధికారులు తెలిపారు.దీంతో నెల్లూరు వైపు నుంచి వచ్చే విద్యుత్ సరఫరాను నిలిపేశామన్నారు. మిగిలిన రెండు మార్గాల్లో ప్రత్యామ్నాయంగా రేణిగుంటకు విద్యుత్ సరఫరాను తీసుకున్నామని తెలిపారు.వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు.