TTD: టీటీడీకి జరిమానా!
ABN , First Publish Date - 2023-03-28T02:07:59+05:30 IST
తిరుమల తిరుపతి దేవస్థానాల(టీటీటీ)కి కేంద్రం భారీ జరిమానా విధించింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద పొందిన లైసెన్సు గడువు ముగిసినా రెన్యువల్ చేసుకోని కారణంగా కేంద్ర హోం శాఖ రూ.3 కోట్ల జరిమానా విధించింది.

విదేశీ కానుకల విషయంలో రూ.3 కోట్లు ఫైన్ వేసిన కేంద్రం
ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సు రెన్యువల్ చేసుకోని వైనం
2018లోనే ముగిసిన గడువు.. రూ.30 కోట్ల విదేశీ కరెన్సీ
దాని ఖాతాలో వేయని ఎస్‌బీఐ.. దీనికి ప్రతిఫలమే జరిమానా
కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ట్వీట్‌తో రట్టు
(తిరుపతి/తిరుమల-ఆంధ్రజ్యోతి)
తిరుమల తిరుపతి దేవస్థానాల(టీటీటీ)కి కేంద్రం భారీ జరిమానా విధించింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద పొందిన లైసెన్సు గడువు ముగిసినా రెన్యువల్ చేసుకోని కారణంగా కేంద్ర హోం శాఖ రూ.3 కోట్ల జరిమానా విధించింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్వీట్‌తో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లైసెన్సు రెన్యువల్ చేసుకోని కారణంగా శ్రీవారికి విదేశీ భక్తులు హుండీ కానుకల కింద చెల్లించిన విదేశీ కరెన్సీ రూ.30కోట్ల మేరకు టీటీడీ ఖాతాలో డిపాజిట్ కాకుండా ఎస్‌బీఐ వద్ద మూలుగుతోంది. లైసెన్స్ రెన్యువల్ కాకపోవడంతో మారకానికి భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) అంగీకరించలేదు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏర్పాటుచేసిన హుండీలో వేసే నగదు లేదా ఖరీదైన లోహాలు, ఇతర వస్తువులకు భక్తులు ఎలాంటి లెక్కలూ చెప్పాల్సిన పనిలేదు. తరచూ భారీ మొత్తాల్లో అజ్ఞాత భక్తులు నగదు వేస్తుంటారు. అదే సమయంలో విదేశాల్లో ఎక్కడెక్కడో ఉన్న భక్తులు సైతం తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనానంతరం హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు. వాటిలో ఆయా దేశాల కరెన్సీ కూడా ఉంటుంది. గతంలో ఆ విదేశీ నగదును ఆర్‌బీఐ ద్వారా టీటీడీ మన కరెన్సీలోకి మార్చుకునేది. 2018 తర్వాత అలా మారకానికి ఆర్‌బీఐ అంగీకరించడం లేదు. దానికి తోడు విదేశీ కరెన్సీని ఎస్‌బీఐ టీటీడీ ఖాతాలో డిపాజిట్ చేయడానికీ ఒప్పుకోవడం లేదు. ఫలితంగా 2018 నుంచీ ఇప్పటి వరకూ సుమారు రూ.30 కోట్ల మేరకు విదేశీ కరెన్సీ టీటీడీ ఖాతాలో జమ కాకుండా ఎస్‌బీఐ వద్ద మూలుగుతోంది.
అసలేం జరిగిందంటే...
విదేశీ భక్తుల నుంచి విరాళాలు సేకరించడానికి టీటీడీ కేంద్ర హోం శాఖ నుంచి ఎఫ్‌సీఆర్‌ఏ చట్టం కింద లైసెన్సు పొందింది. దానివల్ల 2018 వరకూ విదేశీ కరెన్సీ మారకానికి ఆర్‌బీఐ అనుమతించేది. ఎస్‌బీఐ కూడా విదేశీ కరెన్సీని టీటీడీ ఖాతాలో డిపాజిట్ చేసేది. 2018లో లైసెన్సు గడువు ముగిసింది. దాని రెన్యువల్‌పై టీటీడీ దృష్టి సారించలేదు. కేంద్ర హోం శాఖలోని ఎఫ్‌సీఆర్‌ఏ విభాగం 2019లో దీన్ని గుర్తించింది. లైసెన్సు లేకపోయినా టీటీడీ విదేశీ విరాళాలు సేకరించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రూ.1.14 కోట్ల జరిమానా విధించింది. ఎఫ్‌సీఆర్‌ఏ చట్టానికి 2020లో చేసిన సవరణల ప్రకారం.. విదేశీ విరాళాలపై వచ్చే వడ్డీని ఆయా సంస్థలు వినియోగించుకోకూడదు. కానీ టీటీడీ వినియోగించుకోవడంపై కూడా కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. టీటీడీ ఆలస్యంగా అందజేసిన ఆదాయ వివరాలను కూడా సక్రమ ఫార్మాట్‌లో ఇవ్వలేదని తాజాగా మరో రూ.3.19 కోట్ల జరిమానా విధించింది. దీంతో జరిమానా మొత్తం రూ.4.33 కోట్లకు చేరుకుంది.
ట్వీట్‌తో రగులుకున్న వివాదం
టీటీడీకి జరిమానా విధించడంపై కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేశ్ తాజాగా ట్వీట్ చేశారు. హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిందూ ధార్మిక సంస్థ అయిన టీటీడీకి జరిమానా విధించడాన్ని ఆయన తప్పు పట్టారు. దీంతో ఇది రాజకీయ వివాదంగా మారుతోంది. టీటీడీ సకాలంలో రెన్యువల్ ఎందుకు చేయలేదు? అంటే ప్రస్తుత అధికారులు గానీ, పాలకవర్గం గానీ సరైన సమాధానం చెప్పడం లేదు. కేంద్రంతో ఉత్తరప్రత్యుత్తరాలు జరపడం మినహా ఆ వివరాలను మీడియా ద్వారా భక్తులకు తెలియజేసే ప్రయత్నం చేయకపోవడంతో దీనిపై పలురకాల ప్రచారాలు సాగుతున్నాయి. కేంద్ర హోం శాఖ నిర్దేశించినట్లుగా ఎఫ్‌సీఆర్‌ఏ చట్టం నియమ నిబంధనలను టీటీడీ పాటించకపోవడం, సరైన ఫార్మాట్‌లో ఆదాయ వివరాలను సమర్పించకపోవడమే జరిమానాకు కారణమని స్పష్టమవుతోంది.
రూ.3 కోట్లు జరిమానా చెల్లించాం: సుబ్బారెడ్డి
కేంద్ర హోంశాఖ ఎఫ్‌సీఆర్‌ఏ విభాగానికి రూ.3 కోట్ల జరిమానా చెల్లించామని టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. విదేశీ కరెన్సీని విరాళాలుగా స్వీకరించేందుకు కేంద్రం నుంచి టీటీడీ పొందిన ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సును 2018కి ముందే నిబంధనలు పాటించడం లేదనే కారణాలతో రద్దు చేశారన్నారు. ఈ ఐదేళ్లలో టీటీడీకి హుండీ ద్వారా దాదాపు రూ.30 కోట్ల విదేశీ కరెన్సీ వచ్చిందని.. ఈ నగదు మార్పిడి కోసం ప్రయత్నించగా, ఈ నగదు ఎవరిచ్చారు.. ఎలా తీసుకున్నారంటూ ఆర్‌బీఐ ప్రశ్నించిందని తెలిపారు. గుర్తుతెలియని భక్తులు హుండీలో వేసే కానుకలు కావడంతో ఎవరిచ్చారో గుర్తించడం సాధ్యం కాదన్నారు. అయినప్పటికీ ఈవో ధర్మారెడ్డి ఇప్పటికే కేంద్ర హోంశాఖ అధికారులతో రెండుమూడు సార్లు చర్చించి వాస్తవాలను తెలియజేశారని చెప్పారు. టీటీడీ నిబంధనలు అతిక్రమించిందంటూ కేంద్రం భారీగా జరిమానా విధించిన క్రమంలో తాము హోం శాఖ అధికారులతో మాట్లాడి.. టీటీడీ వ్యాపార కేంద్రం కాదని, ఓ ఽధార్మిక క్షేత్రమని, అనేక మంది భక్తులు భక్తితో కానుకలు సమర్పిస్తారని వివరించడంతో జరిమానాను రూ.3 కోట్లుగా నిర్ణయించారన్నారు. ఈ మొత్తాన్ని టీటీడీ చెల్లించిందన్నారు. మరో వారం పదిరోజుల్లో సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారమైపోతుందన్నారు.