తిరుపతి బస్టాండులో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2023-07-31T02:26:03+05:30 IST

తిరుపతి సెంట్రల్‌ బస్టేషన్‌ పరిధిలోని ఏడుకొండల బస్టాండు పక్కనున్న టీటీడీ టైంస్లాట్‌ టోకెన్ల జారీ కౌంటర్‌లో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది.

తిరుపతి బస్టాండులో అగ్నిప్రమాదం
సర్వదర్శన టైంస్లాట్‌ కౌంటర్‌ లోపల చెలరేగుతున్న మంటలు

తిరుపతి(కొర్లగుంట), జూలై 30 : తిరుపతి సెంట్రల్‌ బస్టేషన్‌ పరిధిలోని ఏడుకొండల బస్టాండు పక్కనున్న టీటీడీ టైంస్లాట్‌ టోకెన్ల జారీ కౌంటర్‌లో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. లోపల ఫర్నిచర్‌, చెత్త పేరుకుపోవడంతో నిమిషాల వ్యవధిలో మంటలు వ్యాపించి, పెద్దఎత్తున ఎగసిపడ్డాయి. భయాందోళనతో ప్రయాణికులు పరుగులు తీశారు. ఆ సమయానికి బస్టాండుకు నీరు సరఫరా చేసే వాటర్‌ ట్యాంక్‌ రావడంతో ఆర్టీసీ అధికారులు సిబ్బందితో కలిసి మంటలను అదుపుచేశారు.అప్పటికే లోపలున్న ఫర్నిచర్‌, చెత్త, కాగితాలు పూర్తిగా కాలిపోయాయి. యాచకుల ధూమపానం లేదా కౌంటర్‌ లోపలి భాగంలో విద్యుత్‌ జంక్షన్‌ బాక్సుల్లో షార్ట్‌సర్క్యూట్‌ వల్ల మంటలు వ్యాపించి ఉండవచ్చునని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. అనంతరం కూలీలు కౌంటర్‌ లోపల శుభ్రం చేశారు.

టీటీడీ నిర్లక్ష్యంతోనే తరచూ ప్రమాదాలు

సామాన్య భక్తుల సౌకర్యార్థం గతంలో టీటీడీ సర్వదర్శన టైంస్లాట్‌ టోకెన్ల జారీ కోసం తిరుపతిలోని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లు నిర్మించింది. ప్రయాణికుల సౌకర్యార్థం సీబీఎ్‌సలోనూ ఆధునిక హంగులు, మౌలిక సదుపాయాలతో విశాలమైన కౌంటర్‌ను ఏర్పాటు చేసింది. కొవిడ్‌ సమయంలో ఈ కౌంటర్లన్నీ మూతపడ్డాయి.గతేడాది సర్వదర్శన టైంస్లాట్‌ టోకెన్ల జారీకోసం గోవిందరాజసత్రాలు, శ్రీనివాసం, విష్ణునివాసం కౌంటర్లను మళ్లీ ప్రారంభించారు. బస్టాండు ఆవరణలో ఉన్న ఈ కౌంటర్‌ను పట్టించుకోలేదు. యాచకులు, గుర్తు తెలియని వ్యక్తులు ఆ కౌంటర్‌ను స్థావరంగా మలుచుకున్నారు. లోపలున్న ఫర్నిచర్‌ తుప్పుపట్టిపోయింది. గతంలోనూ కౌంటర్‌ వెలుపల స్వల్ప అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇకనైనా టీటీడీ యాజమాన్యం స్పందించి నిరుపయోగంగా ఉన్న ఈ కౌంటర్‌ను వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరముంది.

Updated Date - 2023-07-31T02:26:03+05:30 IST