వైభవంగా సంకటహర గణపతి వ్రతం
ABN , First Publish Date - 2023-01-11T00:10:53+05:30 IST
కాణిపాకంలో మంగళవారం సంకటహర గణపతి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. అలంకార మండపం వద్దనున్న కల్యాణ వేదికపై సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామిని కొలువుదీర్చి అర్చకులు విశేషపూజలు నిర్వహించారు.
ఐరాల (కాణిపాకం), జనవరి 10: కాణిపాకంలో మంగళవారం సంకటహర గణపతి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. అలంకార మండపం వద్దనున్న కల్యాణ వేదికపై సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామిని కొలువుదీర్చి అర్చకులు విశేషపూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల ఆధ్వర్యంలో అర్చక పండితులు సంకటహర గణపతి వ్రతాన్ని నిర్వహింపజేశారు. ఈ వ్రతాన్ని ఆలయంలో పౌర్ణమి గడిచిన నాలుగు రోజులకు నిర్వహించడం ఆనవాయితీ. ఈ వ్రతాన్ని నిర్వహిస్తే సర్వకష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. రాత్రి సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధుని ఉత్సవ విగ్రహాలను అలంకార మండపం నుంచి తీసుకొచ్చి స్వర్ణరథంపై ఆశీనులను చేసి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి శాంతి సాగర్‌రెడ్డి, ఏఈవో విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీనివాస్, ఆలయ ఇన్‌స్పెక్టర్లు బాలాజీ నాయుడు, బాబు తదితరులు పాల్గొన్నారు.