15 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్‌

ABN , First Publish Date - 2023-09-08T01:05:56+05:30 IST

జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్‌ 15వ తేదీ నుంచి ప్రారంభమౌతుందని ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్రీనివాసులు అన్నారు.

15 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్‌
జిల్లా అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌

చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 7: జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్‌ 15వ తేదీ నుంచి ప్రారంభమౌతుందని ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్రీనివాసులు అన్నారు. గురువారం జేసీ క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. తమ పరిధిలోని గృహాలను వలంటీర్లు సందర్శించి అక్కడి ప్రజలకు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించాలన్నారు. యాప్‌లో వారి ఆరోగ్య వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి ఏఎన్‌ఎం, సీహెచ్‌సీ వైద్యాధికారులు సందర్శించే తేదీలను వారికి తెలియజేయాలన్నారు. ఈనెల 30 నుంచి నిర్వహించే వైద్య శిబిరాల్లో గ్రామ, పట్టణప్రాంతాల్లో వ్యాధిగ్రస్తులకు మూత్ర, రక్త తదితర వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్యసహాయం అందించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారన్నారు. అవసరమైతే రెఫరల్‌ ఆస్పత్రికి పంపి ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన ఆరోగ్యం అందిస్తారని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో రాజశేఖర్‌, జడ్పీ సీఈవో ప్రభాకర్‌ రెడ్డి, డీఎంహెచ్‌వో ప్రభావతి, డీఆర్డీఏ పీడీ తులసి, డీసీహెచ్‌ఎ్‌స నాయక్‌, జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి వెంకటప్రసాద్‌, డీఈవో విజయేంద్రరావు, డీపీవో లక్ష్మి, డీఎల్డీవో రవికుమార్‌, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

నెలాఖరులోగా సర్వేరాళ్లు నాటే ప్రక్రియ పూర్తి

జిల్లాలోని 105 గ్రామాల్లో జరుగుతున్న భూరీసర్వే.. 51,413 సర్వేరాళ్లు నాటే ప్రక్రియను నెలాఖరులోగా పూర్తిచేస్తామని ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్రీనివాసులు అన్నారు. గురువారం అమరావతి నుంచి సీసీఎల్‌ఏ చీఫ్‌ కమిషనర్‌ జి. సాయిప్రసాద్‌, సర్వేశాఖ కమిషనర్‌ సిద్ధార్థజైన్‌, కార్యదర్శి బాబు అహమ్మద్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు. సర్వేపనుల కోసం 113 రోవర్లను వినియోగిస్తున్నామని, వీటిలో 56 రోవర్లు సర్వేరాళ్ళు నాటే ప్రక్రియలో పాల్గొంటున్నాయన్నారు.

నాణ్యతతో పనులు పూర్తిచేయాలి

గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా చేపట్టిన పనులను నాణ్యతతో పూర్తిచేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్రీనివాసులు అన్నారు. గురువారం సచివాలయం నుంచి సీఎస్‌ కె.ఎ్‌స.జవహర్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్సు అనంతరం ఆయన జిల్లా అధికారులతో మాట్లాడారు. జగనన్నకు చెబుదాం, స్పందన కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. ఇకపై ప్రతి బుధ, శుక్రవారాల్లో మండలస్థాయిల్లోనూ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో రాజశేఖర్‌, డీఎంహెచ్‌వో ప్రభావతి, డీఐవో రవిరాజు, జడ్పీ సీఈవో ప్రభావతి, డీఈవో విజయేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-08T01:05:56+05:30 IST