TeluguDesam : చంద్రబాబు మనసు గెలిచిన జర్నలిస్ట్.. పసుపు కండువా కప్పి పెద్ద పదవి.. ఈయన బ్యాగ్రౌండ్ తెలిస్తే..
ABN , First Publish Date - 2023-06-10T01:30:25+05:30 IST
పూతలపట్టు నియోజకవర్గ ఇన్‌చార్జి పదవిని ఎట్టకేలకు టీడీపీ అధిష్ఠానం భర్తీచేసింది...
చిత్తూరు సిటీ, జూన్ 9 : పూతలపట్టు నియోజకవర్గ ఇన్‌చార్జి పదవిని ఎట్టకేలకు టీడీపీ అధిష్ఠానం భర్తీచేసింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పూతలపట్టు మండలం గొడుగుచింత గ్రామానికి చెందిన మురళిని నియమిస్తున్నట్లు మాజీ మంత్రి అమరనాథరెడ్డి, పూతలపట్టు నియోజకవర్గ పరిశీలకుడు బొమ్మన శ్రీధర్ తెలిపారు. శుక్రవారం నియోజకవ్గరంలోని ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు.. మురార్జీ యాదవ్, ఎన్‌పీ జయప్రకాష్, గిరిధర్ బాబు, దిలీప్ కుమార్, దొరబాబు చౌదరి, ఇతర సీనియర్ నేతలతో చర్చించి నియోజకవర్గ ఇన్‌చార్జిగా మురళిని నియమించారు. నియోజకవర్గంలోని పార్టీ నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి మురళిని గెలిపించాలని అధినేత సూచించారు. మురళి ప్రస్తుతం తిరుపతి కేంద్రంగా ఒక టీవీ చానల్ రిపోర్టరుగా పనిచేస్తున్నారు. కాగా.. ఇటీవల జీడీనెల్లూరు నియోజకవర్గానికి కార్వేటినగరం మండలం అన్నూరు పంచాయతీ అల్లాగుంట గ్రామానికి చెందిన, చెన్నైలో స్థిరపడిన డాక్టర్ థామ్‌సను నియమించిన విషయం తెలిసిందే.
ఇదీ డాక్టర్ మురళి నేపథ్యం..
డాక్టర్ కలికిరి మురళీమోహన్ సొంత ఊరు పూతలపట్టు మండలం గొడుగుచింత గ్రామం. కలికిరి ధనమ్మ, కలికిరి అన్నయ్యలు ఈయన తల్లిదండ్రులు. ఆయన వయస్సు 42 సంవత్సరాలు, కులం ఎస్సీ (మాల), జర్నలిస్టు వృత్తిలో ఉన్నారు. ఎంసీజే, ఎంకామ్, పీహెచ్‌డీ చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడిగా 2014-19, 2019 నుంచి ఇప్పటి రెండు పర్యాయాలు ఉన్నారు. ఏపీ ఎలక్ర్టానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మాజీ ఇండియన్ జన్నలిస్టు యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు. మురళి భార్య నీరుగట్టి అన్నపూర్ణ ప్రభుత్వ అధికారిణి.కాగా.. తనపై నమ్మకం ఉంచి చంద్రబాబు ఈ బాధ్యతలు అప్పగించారని ఆయన నమ్మకాన్ని వమ్ము చేయబోనని మురళి చెప్పారు. అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, పార్టీ నేతలు, కార్యకర్తల సహకారంతో వచ్చే ఎన్నికల్లో పూతలపట్టు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేస్తామన్నారు.