ఆన్‌ గవర్నమెంట్‌ డ్యూటీ బోర్డు

ABN , First Publish Date - 2023-05-20T00:48:54+05:30 IST

అక్రమార్కులు తెలివిమీరిపోతున్నారు. కారుకు ఏకంగా ఆన్‌ గవర్నమెంట్‌ డ్యూటీ బోర్డు పెట్టేసి.. కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు.

 ఆన్‌ గవర్నమెంట్‌ డ్యూటీ బోర్డు
పట్టుబడ్డ నిందితుడు, స్వాధీనం చేసుకున్న కారు, మద్యంతో పోలీసులు

గంగాధరనెల్లూరు, మే 19: అక్రమార్కులు తెలివిమీరిపోతున్నారు. కారుకు ఏకంగా ఆన్‌ గవర్నమెంట్‌ డ్యూటీ బోర్డు పెట్టేసి.. కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసమూర్తి గంగాధరనెల్లూరు పోలీ్‌సస్టేషన్‌లో శుక్రవారం మీడియాకు వివరాలు తెలిపారు. ఎస్పీ రిశాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ముందస్తు సమాచారంతో చిత్తూరు తాలుకా సీఐ గంగిరెడ్డి, గంగాధరనెల్లూరు, నరసింగరాయనిపేట ఎస్‌ఐలు రామాంజనేయులు, వెంకట సుబ్బమ్మలతోపాటు సిబ్బందిని అప్రమత్తం చేశారు. గంగాధరనెల్లూరు మండలం పెద్దకాల్వ పంచాయతీ ఠాణా చెక్‌పోస్ట్‌ వద్ద శుక్రవారం ఉదయం 6.15గంటలకు వాహనాల తనిఖీలు చేపట్టారు. చిత్తూరు మండలం చవటపల్లె గ్రామానికి చెందిన మొగిలయ్య కుమారుడు రూప్‌సాగర్‌(27) చిత్తూరు నుంచి గంగాధరనెల్లూరు మండలంవైపు ఓ కారుకు గవర్నమెంటు డ్యూటీ పేరుతో బోర్డు పెట్టుకుని వస్తుండగా ఆపారు. వాహనంలో తనిఖీ చేయగా.. 3,360 కర్ణాటక మద్యం టెట్రాప్యాకెట్‌లు కనిపించాయి. దాంతో వాహనంతోపాటు మద్యాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్టు చేశారు. మద్యం విలువ రూ.94,012 కాగా.. కారు విలువ రూ.9లక్షలు అని పోలీసులు తెలిపారు. ఇక కర్ణాటక నుంచి ఏపీకి మద్యం తరలించడానికి సహకరిస్తున్న సతీష్‌, మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న చిత్తూరు మూడో గేట్‌కు చెందిన డిక్కీ అనే ఇద్దరిని కూడా అరెస్టు చేయాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడానికి కృషి చేసిన మఫ్టీ పోలీసులు ఇద్దరికి రివార్డు అందజేశారు. గంగాధరనెల్లూరు ఎస్‌ఐ రామాంజనేయులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-05-20T00:48:54+05:30 IST