Deputy CM Narayana Swamy: ‘గడప గడప’కు తాళం
ABN , First Publish Date - 2023-05-25T02:48:18+05:30 IST
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సమస్యలు చెప్పినవారిపై కేసులు పెట్టిస్తున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి గ్రామస్థులు షాక్ ఇచ్చారు.
డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి జనం షాక్!
ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయిన గ్రామస్థులు
సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారనే!
పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకూ అదే నిరసన
ఎమ్మెల్యే వెళ్లిపోయాక పసుపునీళ్లతో వీధులు శుభ్రం
సిగ్గూ.. రోషం ఉంటే డబ్బు వెనక్కిచ్చేయాలన్న ఎమ్మెల్యే
ఆ కుటుంబాలకు నోటీసులు ఇవ్వండి: డిప్యూటీ సీఎం
8డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి జనం షాక్!
పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు అదే నిరసన
పూతలపట్టు, గంగాధరనెల్లూరు, మే 24: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సమస్యలు చెప్పినవారిపై కేసులు పెట్టిస్తున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి గ్రామస్థులు షాక్ ఇచ్చారు. ఆయన వచ్చే సమయానికి గ్రామస్థులంతా ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం పాచిగుంట గ్రామంలో బుధవారం జరిగిందీ ఘటన. గ్రామంలో 23 కుటుంబాలుండగా, 21 కుటుంబాలవారు ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. సమస్యలపై నారాయణ స్వామిని ప్రశ్నిస్తే కేసుల్లో ఇరికించి వేధిస్తున్నారని, అందుకే ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయామని గ్రామస్థులు చెప్పారు. దీనిపై నారాయణస్వామి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కమ్మ, బలిజలు కాబట్టే తాళాలు వేసుకొని వెళ్లిపోయారని, వాళ్లలో పథకాల లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. వారిలో అనర్హులను గుర్తించి పథకాలు తీసేద్దామన్నారు. ఇదే జిల్లాలోని పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎ్‌స.బాబుకు ఇలాంటి పరాభవమే జరిగింది.
పూతలపట్టు మండలం పేట అగ్రహారం దళితవాడలో మూడు కుటుంబాలు మినహా, మిగిలిన వారంతా తమ ఇళ్లకు తాళాలు వేసుకుని గ్రామాన్ని వదిలి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘మా పథకాలు తీసుకుంటారు. మా డబ్బులు తీసుకుంటారు. మేం గ్రామంలోకి వస్తే ఇళ్లకు తాళాలు వేసుకొని వెళ్లిపోతున్నారు. సిగ్గు, రోషం ఉంటే మా పథకాలు, డబ్బులు వెనక్కి ఇచ్చేయండి. మాకూ రోషం ఉంది. ఇకపై మీ గ్రామానికి ఒక్క పథకాన్ని కూడా రానీయం’ అని ధ్వజమెత్తారు. ఆయన వెళ్లిన వెంటనే గ్రామంలోకి తిరిగొచ్చిన ప్రజలు పసుపు నీటితో వీధులను శుభ్రం చేశారు. టీడీపీ జెండాలు చేతబట్టి ‘జై టీడీపీ, జై చంద్రబాబు’ అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.