గడప గడపకూ అర్జీలకు ప్రాధాన్యత : కలెక్టర్‌

ABN , First Publish Date - 2023-01-21T23:35:06+05:30 IST

గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు ప్రాధాన్యత ఇచ్చి ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ అధికారులను ఆదేశించారు.

గడప గడపకూ అర్జీలకు ప్రాధాన్యత : కలెక్టర్‌
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

చిత్తూరు సిటీ, జనవరి1: గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు ప్రాధాన్యత ఇచ్చి ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయన ఎంపీడీవోలు, ఇంజనీరింగ్‌ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 1,972 పనులు మంజూరయ్యాయని, రూ.61 కోట్లతో అంచనాలు తయారు చేశామని అన్నారు. ఇప్పటి వరకు రూ.7 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. ప్రజాప్రతినిధుల పర్యటనలో భాగంగా గుర్తించిన పనులను వెంటనే అప్‌లోడ్‌ చేయాలన్నారు. అర్‌డబ్ల్యూఎస్‌ ద్వారా 943 పనులు మంజూరు కాగా 105 పూర్తయ్యాయని, పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా 794 పనులు మంజూరు కాగా 60 పూర్తయ్యాయని, చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 66 పనులు మంజూరు కాగా 18 పూర్తయ్యాయని, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ద్వారా 118 పనులు మంజూరు కాగా 41 పూర్తయ్యాయని వెల్లడించారు. పనులను వేగవంతం చేసి బిల్లులను అప్‌లోడ్‌ చేయాలని, ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పలువురికి బిల్లులు కూడా మంజూరయ్యాయని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జడ్పీసీఈవో ప్రభాకర్‌ రెడ్డి, పంచాయతీరాజ్‌ ఎస్సీ చంద్రశేఖర్‌ రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ నాగజ్యోతి, పంచాయతీరాజ్‌ ఈఈ చంద్రశేఖర్‌రెడ్డి, మున్సిపల్‌, ఎస్పీడీసీఎల్‌, ఇరిగేషన్‌ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-21T23:35:07+05:30 IST