Share News

డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఇంటి ముట్టడి

ABN , Publish Date - Dec 31 , 2023 | 12:30 AM

అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు తమ వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో చేపట్టిన సమ్మె శనివారంతో 19వ రోజుకు చేరుకుంది.

డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఇంటి ముట్టడి
పుత్తూరులో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇంటి వద్ద అంగన్వాడీల నిరసన - తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి ఇంటికి ర్యాలీగా వెళుతున్న అంగన్వాడీలను చుట్టేసిన పోలీసులు

రోడ్డుపైనే బైఠాయించిన అంగన్వాడీలు

తిరుపతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు తమ వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో చేపట్టిన సమ్మె శనివారంతో 19వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీల ఉద్యోగుల సంఘం మంత్రుల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చింది. దాంతో జిల్లాలోనూ ఉద్యోగులు పుత్తూరు, తిరుపతిలో మంత్రుల ఇళ్ల ముట్టడికి యత్నించారు. పుత్తూరులో డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి ఇంటిని ముట్టడించిన సిబ్బంది సుమారు గంట పాటు ఆయన ఇంటి గేటు వద్ద బైఠాయించి.. ధర్నా చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నారాయణస్వామి అందుబాటులో లేకపోవడంతో ఆయన పీఏకి వినతి పత్రం అందజేసి వెనుదిరిగారు. ఇక తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాస ముట్టడికి చేసిన యత్నం ఉద్రిక్తతకు దారి తీసింది. జిల్లావ్యాప్తంగా పెద్దసంఖ్యలో అంగన్‌వాడీ ఉద్యోగులు ఉదయం 11 గంటలకల్లా తిరుపతి జ్యోతీరావు పూలే విగ్రహం కూడలి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి పోలీసు బలగాలు మొహరించాయి. ఆ కూడలి నుంచి అంగన్వాడీలు, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎ్‌ఫటీయూ తదితర సంఘాల నేతలు భారీ ఎత్తున ర్యాలీగా మంత్రి పెద్దిరెడ్డి నివాసానికి బయల్దేరారు. పోలీసు బలగాలు కూడా వారిని చుట్టేశాయి. ముత్యాలరెడ్డిపల్లె కూడలి వరకూ అనుమతించిన పోలీసులు అక్కడ నుంచి మంత్రి నివాసమున్న మార్గం వైపు వెళ్లకుండా ర్యాలీని అడ్డుకున్నారు. ఆగ్రహించిన అంగన్వాడీలు అక్కడే నడిరోడ్డుపై రెండు గంటలకుపైగా బైఠాయించారు. నేతలు మాట్లాడుతూ.. తక్షణం సమస్యలు పరిష్కరించకుంటే ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. జనవరి మూడో తేదీన కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం చేపట్టనున్నట్టు ప్రకటించారు. అనంతరం నేతలను మాత్రం మంత్రి నివాసానికి అనుమతించారు. అక్కడ మంత్రి అందుబాటులో లేకపోవడంతో అదనపు ఎస్పీ విమలకుమారికి వినతి పత్రం అందచేసి ఆందోళన విరమించారు. కోట మండల కేంద్రంలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టిన ఉద్యోగులు కోలాటం ఆడి నిరసన వ్యక్తం చేశారు. గూడూరు, సూళ్లూరుపేటల్లోనూ రిలే నిరాహార దీక్ష కొనసాగించారు. నాయుడుపేటలో రిలే దీక్షలు కొనసాగించిన సిబ్బందికి ఉమ్మడి నెల్లూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు శివయ్య సంఘీభావం ప్రకటించారు.

Updated Date - Dec 31 , 2023 | 12:30 AM