అధికార పార్టీ నేత.. భూ‘మేత’
ABN , First Publish Date - 2023-04-04T00:52:37+05:30 IST
పదెకరాల పశువుల మేత భూమిని అధికార పార్టీ నేత ఆక్రమించుకున్నాడంటూ పెనుమూరు మండలం పెద్దకలికిరి పంచాయతీలోని కె. గొల్లపల్లె గ్రామస్తులు ఆరోపించారు.
చిత్తూరు, ఏప్రిల్ 3: పదెకరాల పశువుల మేత భూమిని అధికార పార్టీ నేత ఆక్రమించుకున్నాడంటూ పెనుమూరు మండలం పెద్దకలికిరి పంచాయతీలోని కె. గొల్లపల్లె గ్రామస్తులు ఆరోపించారు. తరతరాలుగా పశువుల మేతకు ఉపయోగపడుతున్న భూమిలోనే నీటి కుంట సైతం ఉందన్నారు. మేతభూముల్ని భూస్వాములు ఆక్రమించడమే కాకుండా గ్రామస్థులపై దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు. అధికారులు స్పందించి మేత భూముల్ని పరిరక్షించాలని కోరారు. ఇలా పలువురు సోమవారం చిత్తూరు కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. వివిధ సమస్యలపై మొత్తం 286 మంది అర్జీదారులు హాజరై జేసీ వెంకటేశ్వర్, డీఆర్వో రాజశేఖర్, ఇతర అధికారులకు వినతిపత్రాలను అందించారు. వీటిలో రెవెన్యూశాఖకు 205, హౌసింగ్‌శాఖకు 3, మున్సిపాలిటీ, సీపీవోకు, జిల్లా పరిషత్, ఉపాధి కల్పనాశాఖకు, పోలీ్‌సశాఖకు, పంచాయతీరాజ్‌కు ఒక్కొక్కటి చొప్పున, విద్యాశాఖకు 3, డీఆర్‌డీఎకు 2, నేషనల్ హైవే్‌సకు 2, పెన్షన్లు, రేషన్‌కార్డులకు 65 అర్జీల వంతున అందాయి.
పోలీస్ స్పందనకు 15 ఫిర్యాదులు
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి వచ్చిన అర్జీలన్నింటికీ పరిష్కరిస్తామని ఏఎస్పీ జగదీశ్ అన్నారు. సోమవారం పాత పోలీస్ కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. సమస్యలను పరిష్కరించాలని బాధితుల ఎదుటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. మొత్తం 15 ఫిర్యాదులు అందగా, వాటిలో వేధింపులు 7, ఆస్తి తగాదాలు 4, భూ తగాదాలు, చీటింగ్, కుటుంబ తగాదాల కింద ఒక్కొక్కటి చొప్పున అందాయి.