కాణిపాకంలో వైభవంగా సంకటహర గణపతి వ్రతం

ABN , First Publish Date - 2023-06-08T00:30:48+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో సంకటహర గణపతి వ్రతాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు.

కాణిపాకంలో వైభవంగా సంకటహర గణపతి వ్రతం
సంకటహర గణపతి వ్రతాన్ని నిర్వహిస్తున్న అర్చకులు

ఐరాల(కాణిపాకం), జూన్‌ 7: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో సంకటహర గణపతి వ్రతాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆస్థాన మండపంలో ఈ వ్రతాన్ని నిర్వహించారు. ఉదయం, సాయంత్రం జరిగిన ఈ వ్రతంలో వందలాదిగా భక్తులు పాల్గొన్నారు. ఈ వ్రతాన్ని ఆలయంలో పౌర్ణమి గడచిన నాలుగవ రోజున నిర్వహించడం ఆనవాయితీ. ఈ వ్రతాన్ని నిర్వహిస్తే సర్వ కష్టాలు తొలగి పోతాయని భక్తుల నమ్మకం. ఉదయం మూల విరాట్‌కు అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలను ఆలయ అర్చక, పండితులు నిర్వహించారు. అనంతరం అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలను ఉంచి పూజలు నిర్వహించి, అనంతరం ఆస్థాన మండపానికి భక్తి శ్రద్ధలతో తీసుకెళ్లి భక్తుల ఆధ్వర్యంలో సంకటహర గణపతి వ్రతాన్ని నిర్వహింపజేశారు. అలాగే రాత్రి సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలను స్వర్ణ రథంపై ఉంచి ఆలయ మాడవీధులలో అంగరంగ వైభవంగా ఊరేగించారు. స్వర్ణ రథంపై ఊరేగుతున్న స్వామిని దర్శించుకోవడానికి వందలాదిగా భక్తులు కాణిపాకం తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు, ఏఈవో రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-08T00:30:48+05:30 IST