ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలి : కలెక్టర్
ABN , First Publish Date - 2023-02-28T00:57:55+05:30 IST
శాసనమండలి ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలని, అత్యంత ప్రణాళికాబద్దంగా బందోబస్తు ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఆదేశించారు.
తిరుపతి(కలెక్టరేట్), ఫిబ్రవరి 27: శాసనమండలి ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలని, అత్యంత ప్రణాళికాబద్దంగా బందోబస్తు ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఎస్పీ పరమేశ్వరరెడ్డితో కలిసి మండలి ఎన్నికలపై కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్షిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పట్టభద్రులకు సంబంధించి 101 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ నెల 23న ప్రచురించిన ఓటర్ల జాబితా మేరకు 86,941 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 53,435మంది, మహిళలు 33,494మంది, ఇతరులు 12మంది ఉన్నారన్నారు. ఉపాధ్యాయ నియోజక వర్గాలకు సంబంధించి 37 పోలింగ్ కేంద్రాలు, ఓటర్లు 6,132 మంది ఉన్నారన్నారు. అందులో పురుషులు 3,604, మహిళలు 2,528 మంది ఉన్నారని వివరించారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణ, ఎన్నికల నియమావళి అమలుకు 7ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 23 సెక్టార్లు ఏర్పాటు చేసి రూట్ ఆఫీసర్లను నియమించి 138 పోలింగ్ కేంద్రాలకు అనుసంధానం చేశామన్నారు. ఎన్నికల నిర్వహణకు 15మంది నోడల్ అధికారులను నియమించామన్నారు. సమస్యలు లేని, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటికి అనుగుణంగా బందోబస్తు ప్రణాళిక పటిష్టంగా ఉండాలన్నారు. ఎస్పీ పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ 23 రూట్లకు గాను 31 మొబైల్ టీంలు ఏర్పాటు చేస్తున్నామని, 24 స్ట్రైకింగ్ బలగాలు, 7 ప్రత్యేక స్ట్రైకింగ్ బలకాలు, 4 స్పాట్ టీమ్‌లు ఏర్పాటుతో పాటు కేంద్రాల వద్ద తగినంత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారులు శ్రీనివాసరావు, ఆర్డీవోలు కనకనరసారెడ్డి, రామారావు, చంద్రముని రనాల్, కిరణ్‌కుమార్, అదనపు ఎస్పీలు కులశేఖర్, వెంకటరావు, చెన్నయ్య, రెవెన్యూ, పోలీసు అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.