చాటింపుతో తిరుపతిలో మొదలైన గంగజాతర సందడి

ABN , First Publish Date - 2023-05-10T01:08:45+05:30 IST

ఇందుమూలముగా యావన్మందికీ తెలియజేయడమే మనగా తాతయ్యగుంట గంగజాతర ప్రారంభమైందహో అంటూ మంగళవారం సాయంత్రం కైకాల కులస్తులు చాటింపు వేయడంతో తిరుపతి గంగజాతర సంరంభం మొదలైంది.

 చాటింపుతో తిరుపతిలో మొదలైన గంగజాతర సందడి
విశ్వరూప స్తూపానికి అభిషేకం

నేటినుంచి వేషాల పండుగ ప్రారంభం

ఇందుమూలముగా యావన్మందికీ తెలియజేయడమే మనగా తాతయ్యగుంట గంగజాతర ప్రారంభమైందహో అంటూ మంగళవారం సాయంత్రం కైకాల కులస్తులు చాటింపు వేయడంతో తిరుపతి గంగజాతర సంరంభం మొదలైంది.ఉదయం 7 గంటలకు సంప్రదాయరీతిలో తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలోని విశ్వరూప స్తూపానికి పరిమళ, పవిత్ర జలాలతో అభిషేకం చేసి వడిబాల కట్టారు.ఉదయం 9.30 గంటలకు ఆలయానికి దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి విచ్చేసి, అమ్మవారికి పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటల తరువాత సాధారణ భక్తులకు దర్శనం కల్పించారు.తొలి మంగళవారం కావడంతో భక్తుల రద్దీ కన్పించింది.సాయంత్రం గంగమ్మ జన్మస్థలమైన తిరుపతి రూరల్‌ మండలం అవిలాలనుంచి తాతయ్యగుంట గంగమ్మకు కైకాల కులస్తులు పుట్టింటి సారెను ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం నగర పొలిమేర్లలో జాతరకు చాటింపు వేశారు.

నేడు బైరాగి వేషం

బుధవారం నుంచి వారం రోజులపాటు భక్తులు చిత్ర, విచిత్ర వేషాలు ధరించి గంగమ్మను దర్శించుకుంటారు.తొలి రోజు బైరాగి వేషం వేస్తారు. దీనినే చాటు వేషం అని కూడా అంటారు. పిల్లలనుంచి వ ృద్ధుల వరకు తెల్లగా బూడిదగానీ, విభూది గాని పూసుకుని, నల్లబొట్లు పెట్టుకుని నగర వీధుల్లో విహరిస్తారు. ముఖ్యంగా ఆలయ పారంపర్య చాకలి కులస్తులు ఈ వేషం వేసే సంప్రదాయం వుంది. బేరివీధి మూలనున్న కైకాల వారింటి నుంచి ఈ వేషాన్ని ధరించి గ్రామసంచారం చేసి గంగమ్మ ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటారు. బుధవారం మధ్యాహ్నం గారడివేషం వేస్తారు.ముందుగా వేశాలమ్మను దర్శించుకున్నాక గంగమ్మ ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తారు.

-తిరుపతి కల్చరల్‌

Updated Date - 2023-05-10T01:08:45+05:30 IST