ఈసారి చంద్రబాబే సీఎం

ABN , First Publish Date - 2023-09-16T01:41:51+05:30 IST

ఎందుకంటే అంటూ విశ్లేషించిన యాచకుడు

ఈసారి చంద్రబాబే సీఎం
దీక్షా శిబిరంలో ప్రసంగిస్తున్న యాచకుడు చంద్రశేఖర్‌

నగరి, సెప్టెంబరు 15: నగరిలో కొనసాగుతున్న టీడీపీ దీక్షా శిబిరంలో శుక్రవారం ఒక యాచకుడి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తిరుపతి జిల్లా వాకాడుకు చెందిన చంద్రశేఖర్‌ కొంత కాలంగా పుత్తూరులో భిక్షాటన చేసుకుని జీవిస్తున్నారు. శుక్రవారం ఆయన నగరి ఆర్డీవో కార్యాలయం ఎదురుగా జరుగుతున్న టీడీపీ దీక్షా శిబిరం వద్దకు వచ్చారు. అక్కడున్నవారితో ఆయన రాజకీయాలగురించి మాట్లాడుతూ ఉంటే గమనించినవారు ఆయన చేతికి మైక్‌ ఇచ్చారు. అనర్గళంగా ఆయన ఆంధ్ర, తమిళనాడు రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తూ మాట్లాడుతూ ఉంటే అందరూ విస్తుపోయి చూశారు. ‘మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును అరెస్టు చేయాలంటే గవర్నర్‌ అనుమతి తీసుకోవాలి. తమిళనాడులో స్టాలిన్‌ ముఖ్యమంత్రి అయినా, జయలలిత పేరు మీద నడిపిన అమ్మ క్యాంటీన్లను అలాగే కొనసాగిస్తూ నిరుపేదలకు పట్టెడు అన్నం పెడుతున్నారు. అదే ఆంధ్రాలో జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను మూసివేయించారు’ అంటూ జగన్‌ పాలనను తప్పుపట్టారు. ‘నాడు చంద్రబాబు హయాంలో ఇంట్లో ఎందరుంటే అందరికీ ఫీజు రీయింబర్స్‌మెంటు ఉండేది. నేడు అమ్మఒడి అంటూ ఇంట్లో ఒకరికే ఇస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం వేలాది ఇళ్లు కట్టిస్తే, ఇప్పుడు అగ్గిపెట్టె లాంటి ఇళ్లు కట్టించారు’ అంటూ ఆయన ఏకధాటిగా వివరిస్తూ ఉంటే చప్పట్లతో శిబిరం మార్మోగిపోయింది. తన స్వగ్రామం వాకాడు అని, తనకు ఓటు హక్కు అక్కడే ఉందని ఆ బిక్షగాడు చెప్పారు. ‘చంద్రబాబునాయుడు దేవుడు ఆయన తిరిగి ముఖ్యమంత్రి అవుతాడు’ అని దీవించారు.

Updated Date - 2023-09-16T01:46:20+05:30 IST