తిరుమలలో ముక్కోటి రద్దీ
ABN , Publish Date - Dec 23 , 2023 | 01:45 AM
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు శుక్రవారం మధ్యాహ్నం నుంచే రద్దీ పెరిగింది.
తిరుమల, డిసెంబరు22(ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు శుక్రవారం మధ్యాహ్నం నుంచే రద్దీ పెరిగింది.అర్ధరాత్రి తరువాత వైకుంఠ ద్వార దర్శనాలు మొదలుకానున్న నేపథ్యంలో శ్రీవారి ఆలయం ప్రాంతంతో పాటు మాడవీధులు, అఖిలాండం, లడ్డూ వితరణ కేంద్రం, కాటేజీలు, రోడ్డు, యాత్రికుల వసతి సముదాయాలు, కల్యాణకట్టలు, అన్నప్రసాద కేంద్రం వంటి ప్రాంతాల్లో యాత్రికులు కిక్కిరిసిపోయారు.కొన్ని ప్రాంతాల్లోకి భక్తులను అనుమతించకుండా భద్రతా సిబ్బంది బారికేడ్లను ఏర్పాటు చేశారు.
టోకెన్ ఉన్నవారికే ఎంట్రీ, వసతి
వైకుంఠద్వార దర్శన టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులను అలిపిరి చెక్‌పాయింట్, అలిపిరి, శ్రీవారిమెట్టు నడకమార్గాల్లో అనుమతించారు.అవి లేని భక్తులను వెనక్కు పంపారు. అలాగే దర్శన సమయానికి 24 గంటల ముందు మాత్రమే ఎంట్రీ అని చెప్పడంతో చాలామంది అలిపిరి నుంచి వెనుదిరిగారు. తిరుమల స్థానికులను కూడా ఆధార్ కార్డులు చూశాకే తిరుమలకు పంపారు.తిరుమలలోనూ దర్శన టికెట్లు, టోకెన్లు ఉన్నవారికే గదులను కేటాయించారు. దీంతో గదులు లేని భక్తులు చెట్ల కింద, పార్కుల్లో, కార్యాలయాల ముందు, వసతి సముదాయాల్లో, ఫుట్‌పాత్‌లపైనే సేదదీరాల్సి వచ్చింది. తీవ్రమైన చలికి వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడ్డారు.
భక్తుల ఆందోళన
శనివారం నుంచి మొదలుకానున్న వైకుంఠద్వార దర్శనానికి సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లను తిరుపతిలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి కేటాయిస్తామని, ఈ నేపథ్యంలో శుక్రవారం శ్రీవారిని దర్శించుకోవాలనుకునే నేరుగా తిరుమలకు వెళ్లి టోకెన్ రహిత దర్శనం చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. ఇందులో భాగంగా శుక్రవారం భక్తులు భారీగా తిరుమలకు చేరుకున్నారు. కానీ ఉదయం 10 గంటల సమయానికే కంపార్లుమెంట్లు నిండిపోవడంతో క్యూలైన్ మూసివేశారు. ఆ తర్వాత వచ్చిన భక్తులను దర్శనానికి అనుమతించకపోవడంతో కృష్ణతేజ సర్కిల్‌తో పాటు ఈవో కార్యాలయం ముందున్న సర్కిల్లో భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.తిరుమలకు అనుమతించి దర్శనం లేదు పొమ్మంటే ఎక్కడి పోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈవో కార్యాలయం ముందున్న సర్కిల్‌లో రోడ్డుపై బైఠాయించిన నిరసన వ్యక్తం చేశారు. సాయంత్రం 6 గంటల సమయానికి కంపార్లుమెంట్లు కొన్ని ఖాళీ కాగానే ఆందోళనకు దిగిన భక్తులను దర్శనానికి అనుమతించారు.
నేడు స్వర్ణరథోత్సవం
శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి శనివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు స్వర్ణరథంపై కొలవుదీరి మాడవీధుల్లో విహరిస్తారు.నాదనీరాజనం వేదికపై మధ్యాహ్నం 12 గంటల నుంచి భగవద్గీతలోని 18 అధ్యాయాల్లో ఉన్న 700 శ్లోకాలతో అఖండ పారాయణం చేస్తారు. సాయంత్రం 6 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించనున్నారు.ద్వాదశిని పురస్కరించు కుని ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన కార్యక్రమం జరుగుతుంది.