విజయపురం మండలాన్ని ఎడారిగా మార్చేస్తున్నారు
ABN , Publish Date - Dec 26 , 2023 | 12:18 AM
జిల్లా మైనింగ్ అధికారులు, మండల రెవెన్యూ అధికారులు కలిసి విజయపురం మండలాన్ని ఎడారిగా మార్చేస్తున్నారని బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు నిషిధారాజు విమర్శించారు.
బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు నిషిదా రాజు విమర్శ
పుత్తూరు అర్బన్, డిసెంబరు 25: జిల్లా మైనింగ్ అధికారులు, మండల రెవెన్యూ అధికారులు కలిసి విజయపురం మండలాన్ని ఎడారిగా మార్చేస్తున్నారని బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు నిషిధారాజు విమర్శించారు. విజయపురం మండలంలోని పాతార్కాడులో జరుగుతున్న గ్రావెల్ క్వారీని సోమవారం ఆమె సందర్శించి మాట్లాడారు. రాజకీయ పలుకుబడితో కొంతమంది ఇష్టానుసారం గ్రావెల్ తరలిస్తుంటే జిల్లా మైనింగ్ అధికారుల సూచన మేరకు మండల రెవెన్యూ అధికారులే సిబ్బంది ద్వారా గ్రావెల్ తరలించడానికి సహకరిస్తున్నారని విమర్శించారు. పాతార్కాడు, మహారాజపురం, జగన్నాథపురంలో యధేచ్ఛగా గ్రావెల్ తమిళనాడుకు తరలిపోతున్నదని, ప్రశ్నించే వారిపై రౌడీలతో దౌర్జన్యం చేయిస్తున్నారని ఆరోపించారు. పాతార్కాడు రెవెన్యూలో 62 ఎకరాల భూమిలో తప్పుడు ఎన్వోసీలు సృష్టించి మట్టిని తరలించేశారని, రాళ్లు, రప్పలు, ముళ్లకంపలు అంటూ చదునైన భూమిని కూడా తప్పుడు రికార్డు సృష్టించి కొండలను మాయం చేయడానికి ఎత్తుగడ వేస్తున్నారన్నారు. క్వారీని పరిశీలిస్తే తగిన బిల్లులు లేవని, సరిహద్దు లేదని, యజమాని పేరు అడిగితే సరైన సమాధానం లేదని ఆరోపించారు. గ్రావెల్ క్వారీకి ఇచ్చే భూముల్లో పుంజ అని రికార్డుల్లో ఉంటే ఎలా అనుమతి మంజూరు చేస్తారంటూ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు కైలాసం యాదవ్, సర్పంచ్ బొబ్బిలి, బీజేపీ సీనియర్ నాయకులు పురుషోత్తంరెడ్డి, యుగందర్‌రాజు, యువమోర్చా లేపాక్షి, మునికృష్ణ, సోషల్‌మీడియా కన్వీనర్ వేణు, నాయకులు జానీ తదితరులు పాల్గొన్నారు.