Chandrababu: తెలుగు ప్రజలకు భోగి-సంక్రాంతి శుభాకాంక్షలు..
ABN , First Publish Date - 2023-01-13T15:32:37+05:30 IST
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలుగు ప్రజలకు భోగి-సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలుగు ప్రజలకు భోగి (Bhogi)-సంక్రాంతి (Sankranti) పండుగ శుభాకాంక్షలు (Greetings) తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదల ఇళ్లల్లో వేడుకలు చూడాలనే నాడు సంక్రాంతి కానుకలు ఇచ్చామన్నారు. జన్మభూమి స్ఫూర్తితో గ్రామాల అభివృద్ధికి అంతా కలిసి రావాలని పిలుపిచ్చారు. క్రాంతి అంటే అభ్యుదయమని, సంపదలు, సంస్కృతి పరంగా పురోగతిని ఆశిస్తూ వచ్చే పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు.
భోగి-సంక్రాంతి-కనుమ.. మూడురోజుల పండుగ సంక్రాంతి అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పల్లెల్లో సందళ్లు, సరదాలు, జ్ఞాపకాలు పంచే అతిపెద్ద పండుగ సంక్రాంతి అని, తెలుగువారందరూ పల్లె సీమలకు తరలే ఆత్మీయ పండుగని అన్నారు. ధనిక, పేద తారతమ్యాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు.. పండుగను సంతోషంగా జరుపుకోవాలని నాడు ఆలోచించామన్నారు. టీడీపీ హయాంలో తొలిసారిగా పేదలకు పండుగ కానుకలు ఇచ్చే సాంప్రదాయానికి నాంది పలికామన్నారు. ఒక్క సంక్రాంతికే కాకుండా.. రంజాన్, క్రిస్మస్లకు పండుగ కానుకలిచ్చామన్నారు. ఏడాదికి రూ.350 కోట్లు ఖర్చు చేసి పేదింట పండుగ సంతోషాన్ని నింపామన్నారు.
వైసీపీ ప్రభుత్వం ఆ దిశగా కనీస ఆలోచన చేయకపోవడం దారుణమని చంద్రబాబు విమర్శించారు. సంక్రాంతి అంటేనే సాగు, సౌభాగ్యాలకు పట్టం కట్టే పండుగని, రైతుల కృషి ఫలించి పంటలు ఇళ్లకు చేరే సంతోష సమయమని వ్యాఖ్యానించారు. సాగు వ్యయం తగ్గించి, పంటకు గిట్టుబాటు ధర కల్పించినప్పుడే.. అన్నదాతలకు అసలైన సంక్రాంతి అని భావించామని చంద్రబాబు అన్నారు.