Simhachalam: సింహాచలంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. నియంత్రించలేక చేతులు ఎత్తేసిన అధికారులు

ABN , First Publish Date - 2023-04-23T15:31:37+05:30 IST

ఏడాది మొత్తం చందనం పూతలో ఉండే సింహాచలం (Simhachalam) వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆదివారం (వైశాఖ శుక్లపక్ష తదియ నాడు) భక్తులకు నిజరూపంలో దర్శనమిచ్చారు.

Simhachalam: సింహాచలంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. నియంత్రించలేక చేతులు ఎత్తేసిన అధికారులు

సింహాచలం: ఏడాది మొత్తం చందనం పూతలో ఉండే సింహాచలం (Simhachalam) వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆదివారం (వైశాఖ శుక్లపక్ష తదియ నాడు) భక్తులకు నిజరూపంలో దర్శనమిచ్చారు. చందనోత్సవంగా పేర్కొనే ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు (Devotees) తరలివచ్చారు. వరాహ-నారసింహ అవతారాల సమ్మేళనంగా అలరారుతున్న సింహాద్రినాథుడి నిజరూపాన్ని కనులారా వీక్షించడం మహద్భాగ్యంగా భక్తులు భావిస్తారు. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. స్వామి నిజరూపాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రస్తుతం సింహాచలంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అయితే భక్తులను నియంత్రించలేక అధికారులు చేతులు ఎత్తేశారు. ప్రధాన ప్రవేశ ద్వారం దగ్గర తోపులాట జరిగింది. 1500 రూపాయల లైన్లోకి పంపుతుండగా తొక్కిసలాట జరిగింది. క్యూలైన్లలో చిన్నారులు, వృద్ధులు నలిగిపోయారు. సీపీ త్రివిక్రమ వర్మ (CP Trivikrama Verma), కలెక్టర్ మల్లికార్జున సమక్షంలోనే ఉద్రిక్తత చోటుచేసుకోవడం గమనార్హం. భక్తులను నియంత్రిచడంలో అటు అధికారులు ఇటు పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. అరకొర ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెబుతున్నారు.

ఉత్సవంలో భాగంగా వరాహ లక్ష్మీనృసింహస్వామిని శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత (ఆదివారం తెల్లవారుజామున) ఒంటి గంటకు సుప్రభాత సేవతో మేల్కొల్పారు. 1.30 గంటలకు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనము, రుత్విగ్వరణము, పంచకలశా వాహనం నిర్వహించారు. తరువాత ఆలయ అర్చకులు సంప్రదాయం ప్రకారం ఏడాది పొడవునా స్వామి వారిపై పూతగా వుండే చందనాన్ని వెండి బొరిగెలతో తొలగించి ప్రభాత ఆరాధన చేశారు. అనంతరం తిరిగి స్వామివారి హృదయంపై, శిరస్సుపై అప్పటికే సిద్ధం చేసిన చందనం ముద్దలను ఉంచారు. తెల్లవారుజామున 3.00 గంటలకు ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజుకు, వారి కుటుంబ సభ్యులకు తొలిదర్శనం కల్పించడం అనావాయితీగా వస్తోంది. 3.30 గంటల నుంచి 4 గంటల నడుమ ప్రభుత్వం తరపున స్వామి వారికి దేవదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టువస్త్రాలు సమర్పించారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి సామాన్య భక్తులకు దర్శనాలు కల్పించారు. ఉదయం 5 నుంచి 7 గంటల వరకు, తిరిగి 8 నుంచి 10 గంటల వరకు వీఐపీలకు దర్శనం కల్పించారు.

టికెట్లకు భలే గిరాకీ

మరోవైపు సింహాచలం చందనోత్సవం టికెట్లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఈసారి అంతరాలయ దర్శనానికి అవకాశం ఉండే రూ.1,500 టికెట్లను స్వయంగా కలెక్టరే జారీ చేయడంతో అవి చిన్నా, చితకా చేతులకు అందలేదు. వాటిని ప్రొటోకాల్‌ అధికారులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, శాసనసభ్యులకు మాత్రమే పరిమితంగా అందించారు. రూ.1,500 టికెట్లు ఆరు వేలు వరకు ముద్రించారు. ఒక్కో ప్రజా ప్రతినిధికి 30 చొప్పున ఇచ్చారు. ఇంకా అవసరమైతే వేయి రూపాయల టికెట్లు తీసుకోవాలని చెప్పారు. అధికార పార్టీ ఇష్టానుసారంగా అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పదవులు కల్పించిన సంగతి తెలిసిందే. ఆయా కార్పొరేషన్ల నేతలు కూడా టికెట్లు కావాలని కలెక్టర్‌కు లేఖలు పంపగా, వాటిని తిరస్కరించారు. ఎమ్మెల్యేలతో సమానంగా ట్రస్ట్‌ బోర్టు సభ్యులకు 30 టికెట్లు ఇచ్చారు. ఏదేమైనా అంతరాలయ దర్శనం టికెట్లు మాత్రం ఈసారి ఒక స్థాయి కలిగిన వారికి మాత్రమే ఇచ్చారు. నగరంలో అనేకమంది వ్యాపార ప్రముఖులు, వాణిజ్యవేత్తలు, దాతలు ఉండగా వారికి కూడా ఈ టికెట్లను ఇవ్వలేదు. కలెక్టర్‌ సిఫారసు చేసిన తరువాత సింహాచలంలో ఈఓ కార్యాలయానికి వెళితే అక్కడ టికెట్లు ఇచ్చారు. చాలా మంది మంత్రుల పేరుతో లేఖలు పట్టుకొని అక్కడకు వెళ్లగా తాము ఏమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారు.

Updated Date - 2023-04-23T15:31:57+05:30 IST