Ramakrishna: పోలవరం నిషేధిత ప్రాంతమా?.. పర్యటించకూడదా?..తప్పు చేయకపోతే భయమెందుకు?

ABN , First Publish Date - 2023-06-10T14:36:47+05:30 IST

పోలవరం సందర్శనకు బయలుదేరిన టీడీపీ బృందాన్ని మార్గమధ్యలోనే పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Ramakrishna: పోలవరం నిషేధిత ప్రాంతమా?.. పర్యటించకూడదా?..తప్పు చేయకపోతే భయమెందుకు?

అమరావతి: పోలవరం (Polavaram Project) సందర్శనకు బయలుదేరిన టీడీపీ బృందాన్ని మార్గమధ్యలోనే పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Leader Ramakrishna) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పోలవరంలో పర్యటిస్తే అరెస్టులు చేస్తారా? అని ప్రశ్నించారు. గతంలో పోలవరం పర్యటన సందర్భంగా రాజమండ్రిలో తనను కూడా అడ్డుకుని అరెస్టు చేశారన్నారు. ఇప్పుడు టీడీపీ నేతలు దేవినేని ఉమా (Devineni Uma), నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) తదితరుల అరెస్టులను ఖండిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు పోలవరంలో పర్యటించకూడదా? అంటూ ప్రశ్నించారు. పోలవరం నిర్మాణంలో జగన్ సర్కార్ ఏ తప్పు చేయకపోతే భయమెందుకన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిపక్షాలను పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు తీసుకెళ్లాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

అసలేం జరిగిందంటే...

కాగా.. ఈరోజు ఉదయం పోలవరం ప్రాజెక్టు సందర్శించేందుకు వెళ్తున్న టీడీపీ నేతల బృందాన్ని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. తెలుగుదేశం నేతలు మాజీ మంత్రి దేవినేని ఉమ, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జులు బడేటి చంటి, మద్దిపాటి వెంకటరాజు, గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తదితరులు పోలవరం ప్రాజెక్ట్‌ వద్దకు బయలుదేరారు. అయితే గోపాలపురం మండలం కొవ్వూరు పాడు శివారులో టీడీపీ బృందాన్ని గోపాలపురం పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలవరం సందర్శనకు వెళ్లి తీరుతామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఈ క్రమంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మాజీ మంత్రి దేవినేని ఉమ పోలీసుల కన్నుగప్పి మోటార్ సైకిల్‌పై పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లారు. అదుపులోకి తీసుకున్న నాయకులను గోపాలపురం పోలీస్‌స్టేషన్‌కు పోలీసులు తరలిస్తున్నారు. మరోవైపు పోలీసుల కళ్లు గప్పి పోలవరంకు చేరుకున్న దేవినేని ఉమాను పోలవరం ప్రధాన ద్వారం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2023-06-10T14:36:47+05:30 IST