CPI Narayana: జగన్‌ను ఎదుర్కోవాలంటే ఏపీలో అన్ని పార్టీలు కలవాలి
ABN , Publish Date - Dec 23 , 2023 | 04:39 PM
ఏపీలో పార్టీలు అన్నీ కేంద్ర హోంమంత్రిని, బీజేపీని చూసి భయపడుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు అనిశ్చితంగా ఉన్నాయని, జగన్‌ను ఎదుర్కోవాలంటే ఏపీలో అన్ని పార్టీలు కలవాలని ఆయన సూచించారు.
అమరావతి: ఏపీలో పార్టీలు అన్నీ కేంద్ర హోంమంత్రిని, బీజేపీని చూసి భయపడుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు అనిశ్చితంగా ఉన్నాయని, జగన్‌ను ఎదుర్కోవాలంటే ఏపీలో అన్ని పార్టీలు కలవాలని ఆయన సూచించారు. మోడీని వ్యతిరేకిస్తే తమకు ఎక్కడ ఇబ్బందులు సృష్టిస్తారో అని వారంతా భయపడుతున్నారని, ఇండియా కూటమికి అనుకూలంగా ఉండేవారితోనే మా పొత్తులు ఉంటాయని నారాయణ స్పష్టం చేశారు.
బీజేపీ వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు నష్టం
"బీజేపీ వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు నష్టపోయాయి. ప్రత్యేక హోదా సహా ఏదీ రాలేదు. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీయే. వారితో అంటకాగే పార్టీలకు కూడా ప్రజలు ఓటు వేయరు. జగన్‌కు వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి వెళ్ళాలి అన్నది మా ఉద్దేశం. టీడీపీని ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నాం. పోల్ మేనేజ్‌మెంట్‌కు భయపడి వారు బీజేపీ పొత్తు కోసం ఆరాటపడుతున్నారు" అని నారాయణ అన్నారు.