CPM: సజ్జల వ్యాఖ్యలకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కౌంటర్
ABN , First Publish Date - 2023-09-29T22:05:18+05:30 IST
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) వ్యాఖ్యలపై సీపీఎం (CPM) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) వ్యాఖ్యలపై సీపీఎం (CPM) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీకి వైసీపీ లొంగిపోయిందని, వాళ్లు అడినట్లు వైసీపీ తైతక్కలాడుతున్నారని, పార్లమెంట్‌లో ప్రజావ్యతిరేకమైనటువంటి బిల్లులకు కూడా ఎందుకు మద్దతు తెలుపుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డిని సూటిగా ప్రశ్నించారు.
వైసీపీని నమ్ముకున్న మైనార్టీలు, దళితులను కూడా మోసం చేసి బీజేపీ తెచ్చిన చట్టాలను బలపరిచి, వాళ్ల అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారని మండిపడ్డారు. వీటన్నింటికీ వైసీపీ ఎంతకు అమ్ముడుపోయిందని సజ్జలను ఆయన ప్రశ్నించారు. రిటైల్‌గా అమ్ముడుపోయారా..? ఓకేసారి టోకుగా అమ్ముడుపోయారా?.. బిల్లు బిల్లుకు ఇంత అని తీసుకుంటున్నారా..? బీజేపీకి వైసీపీ ఎందుకు మద్దతు ఇస్తుందని ప్రశ్నించారు. దీనికి వైసీపీ సమాధానం చెప్పడానికి చేతకాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ సీపీఎం తీసుకున్న రాజకీయ వైఖరికి సమాధానం చెప్పడం చేతగాక.. టీడీపీకి అమ్ముడుపోయారని మాట్లాడడంపై ఆయన సీరియస్ అయ్యారు. కమ్యూనిస్టులను కొనడం ఎవరీతరం కాదంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు హెచ్చరించారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కమ్యూనిస్టు పార్టీల నేతలు కూడా మాట్లాడుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు పార్టీల సిద్ధాంతాలు ఏం అయ్యాయో అర్థం కావడం లేదని విమర్శించారు. ఏం జరిగిందో చూసే సమయం కూడా తమకు లేదంటే.. అసలు తమరు ఎంతకు అమ్ముడుపోయారో అని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు అడుగులకు మడుగులు ఎందుకు ఒత్తుతున్నారో తెలిదన్నారు. చంద్రబాబు ఆలోచనలను కమ్యూనిస్టు నేతలు ఎందుకు మాట్లాడుతున్నారో వాళ్లే ఆలోచించుకోవాలని సజ్జల సూచించారు.