Cyclone Michaung: బాపట్ల సమీపంలో తీరం దాటిన 'మిచౌంగ్' తీవ్ర తుఫాన్
ABN , First Publish Date - 2023-12-05T16:41:27+05:30 IST
మిచౌంగ్ తీవ్ర తుఫాన్ బాపట్ల సమీపంలో తీరాన్ని దాటిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీరం వెంబడి గంటకు 90-100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయని వాతావరణ శాఖ పేర్కొంది.
విశాఖపట్నం: మిచౌంగ్ తీవ్ర తుఫాన్ బాపట్ల సమీపంలో తీరాన్ని దాటిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. తీరం వెంబడి గంటకు 90-100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాగల రెండు గంటల్లో తీవ్ర తుఫాన్ తుఫానుగా బలహీనపడనుంది. తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల సంస్థ వెల్లడించింది.
రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న మిచౌంగ్ తుఫాన్ (Michaung Cyclone) బాపట్ల వద్ద తీరాన్ని దాటింది. ఇప్పటికే బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో వేగంగా గాలులు, ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అర్ధరాత్రి వరకు ఇదే వేగంతో గాలులు, వర్షాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాల కారణంగా ఇప్పటికే వరి, వాణిజ్య, ఉద్యానవన పంటలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో కాలనీలు, రహదారులు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి భారీ వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.